ఇంజనీరింగ్ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రముఖ టెక్ సంస్థ ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. ఈ ఏడాదిలో సుమారు 20,000 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొంది. 2025లో ఇన్ఫోసిస్ సుమారు 20,000 మంది కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోవాలని యోచిస్తోందని ఆ కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఐటీ సేవల మేజర్ ఇప్పటికే 17,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకుందని ఆయన తెలిపారు. కంపెనీ ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (ఏఐ), రీస్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించినట్లు ఆయన వివరించారు. వేగంగా మారుతున్న ఏఐ సాంకేతికతను ముందుగానే అందిపుచ్చుకోవడంలో భాగంగానే ఈ నియమాలు చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.
ఇన్ఫోసిస్ సంస్థ ఏఐ, సంబంధిత రంగాలలో ఇప్పటి వరకు సుమారు 2.75 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇప్పించినట్టు సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఇన్ఫోసిస్ కంపెనీ, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఐటీ రంగంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఇన్ఫోసిస్ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు ప్రకటించడం విశేషం.
ఇదిలా ఉండగా ఇటీవలే మరో ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ తమ సంస్థలో పనిచేస్తున్న 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఐటీ పరిశ్రమలలో ఇంత భారీ మొత్తంలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. ఇందుకు ముఖ్య కారణం వేగంగా మారుతున్న సాంకేతిక రంగం, ఏఐ టెక్నాలజీ, ఏఐ వచ్చిన తర్వాత చాలా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఏఐ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. మానవ నైపుణ్యాలు ఇప్పటికీ కీలకమని పరేఖ్ స్పష్టంగా చెప్పారు. సంక్లిష్ట వ్యవస్థలకు ఇప్పటికీ నిపుణుల పర్యవేక్షణ అవసరమని ఆయన అన్నారు.