దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండగల సమయాల్లో ప్రయాణికులకు సౌకర్య వంతమైన ప్రయాణాన్ని అందాలనే ఉద్దేశంతో.. పలు మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల సేవలను మరో నెలపాటు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు మార్గాల్లో నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల గడువును మరోసారి పొడిగించింది. ఈ మేరకు ఆగస్టుతో ముగియనున్న గడువును నవంబర్ 24 వరకు పొడగిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈ రైల్వేశాఖ నిర్ణయంతో పండగలకు సొంత ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణం సులభతరం కానుంది.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
తిరుపతి- సాయినగర్ షిర్డీ మధ్య రాకపోకలు సాగించే (07637/07638) నెంబర్ గల ప్రత్యేక రైళ్ల సేవలను నవంబరు 24 వరకు పొడగిస్తున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది. అదేవిధంగా, నరసాపురం నుంచి తిరువణ్ణామలై మధ్య నడిచే (07219/07220) నెంబర్ గల ప్రత్యేక రైళ్లు కూడా నవంబరు 24 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
వీటితో పాటు హైదరాబాదు-కన్యాకుమారి మధ్య నడిచే (07230/07229) నెంబర్ గల ప్రత్యేక రైలు, కాచిగూడ-మధురై మధ్య నడిచే (07191/07192) నెంబర్లు గల ప్రత్యేక రైళ్లను సేవలను కూడా పొడగిస్తున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది. అలాగే హైదరాబాదు-కొల్లాం మధ్య నడిచే (07193/07194) నెంబర్ గల ప్రత్యేక రైళ్లు తిరుపతి, రేణిగుంట మీదుగా నవంబరు చివరి వరకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు తెలిపారు.