రుతు పవనాల ప్రభావంతో దేశంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. 5 రాష్ట్రాల్లో వానలు వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ నెల 20 వరకు పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చెదురుమదురు వానలు పడుతున్నాయి.
దక్షిణ మధ్య మహారాష్ట్ర దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణ మీదుగా ఉత్తరాంధ్ర తీరం వరకు కొనసాగిన ద్రోణి బలహీనపడింది. దీని ప్రభావంతో ఈ రోజు(సోమవారం) తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు తెలంగాణలోని నల్లగొండలో గరిష్టంగా 38.5, మహబూబ్‌నగర్‌లో కనిష్టంగా 28 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
అటు ఏపీలోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిశా వరకు, మరఠ్వాడ నుంచి తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు వేర్వేరు ఉపరితల ద్రోణులు విస్తరించాయి. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయట. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.