ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో వరుస దొంగతనాలు సంచలనం రేపుతున్నాయి. సాక్షాత్తు శ్రీశైలం ఆలయంలో పనిచేసే పరిచారకుడే తన చేతివాటం ప్రదర్శించాడు. శ్రీశైలం ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామి వారి హుండీ నుంచి 24,200 రూపాయలను దొంగలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. రోజువారి భద్రతా చర్యలలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలోని వివిధ ప్రదేశాలలో మొత్తం 600 కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతీరోజు ఆలయ ఈఓ శ్రీనివాసరావు పలుమార్లు సి.సి. కెమెరాల పుటేజీలను పరిశీలిస్తూ సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రధానంగా క్యూ కాంప్లెక్సు, క్యూలైన్ల నిర్వహణ, ప్రధానాలయం, ప్రసాదాల విక్రయ కేంద్రం, అన్నప్రసాద వితరణ, పారిశుద్ధ్యం, కల్యాణకట్ట, వలయ రహదారి, పాతాళ గంగ మొదలైన ప్రదేశాలను తరచుగా సి.సి. కెమెరాల ద్వారా ఈఓ శ్రీనివాస రావు పరిశీలిస్తుంటారు.
అయితే గురువారం వేకువ జామున ఈ.ఓ సుమారు గం. 2.00ల సమయంలో అకస్మాత్తుగా నిద్ర నుంచి మెలుకువ రావడంతో క్యాంపు కార్యాలయం నుంచి సి.సి. కెమెరా పుటేజీలను పరిశీలించారు. ఈ పరిశీలనలో ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని కూడా ఈఓ శ్రీనివాసరావు సి.సి. కెమెరా ఫుటేజీ ద్వారా పరిశీలించారు. ఆ సమయంలో అనగా సుమారు గం.2.15ని.ల సమయంలో ప్రధానాలయంలోని రత్నగర్భ గణపతి స్వామి ఆలయానికి దగ్గరలో గల హుండీ వద్ద స్వామివారి ఆలయ పరిచారకుడు హెచ్.విద్యాదర్ అనుమానస్పదంగా ఉండడాన్ని ఈఓ గుర్తించారు. వెంటనే వెళ్లి ఆకస్మిక తనిఖీ చేయవలసినదిగా భద్రతాధికారి అయిన యం.మల్లికార్జునను ఆదేశించారు. వెంటనే ముఖ్య భద్రతాధికారి మల్లికార్జున ఆకస్మిక తనిఖీని చేపట్టారు.
తనిఖీలో హెచ్ విద్యాధర్ పరిచారకుడు స్వామివారి ఆలయం హుండీ నుంచి నగదును తస్కరించి, స్వామివారి ఆలయంలో తీర్థ ప్రసాదాలు అందజేసే ప్రదేశంలో గల బీరువాలో దాచినట్లుగా గుర్తించారు. వెంటనే ఆలయ ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి, ఆలయ ఎ.ఈ.ఓ ఎం. హరిదాసు సమక్షములో పంచనామాను నిర్వహించి తస్కరించిన నగదును పరిశీలించారు. ఈ పరిశీలనలో హెచ్. విద్యాధర్, రూ.24,220/- నగదును తస్కరించినట్లుగా గుర్తించారు. అనంతరం సమగ్ర విచారణకు ఆదేశించారు. ప్రాథమికంగా హెచ్.విద్యాధర్, పరిచారకను విధుల నుంచి తొలగించి, తగు విచారణ కోసం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామని ఈవో తెలిపారు.