స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎంటీఎస్, హవల్దార్ పోస్టుల భర్తీకి జూన్ నెలలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 5,464 ఎంటీఎస్, హవల్దార్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 26వ తేదీన ప్రారంభమవగా.. జులై 24, 2025వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. జులై 29 నుంచి 31 వరకు అప్లికేషన్ సవరణకు అవకాశం కల్పిస్తుంది. అయితే పదో తరగతి అర్హత కలిగిన ఈ పోస్టులకు ఆన్‌లైన్ రాత పరీక్ష, ఆ తర్వాత ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అర్హులైన అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం రాత పరీక్షలు సెప్టెంబర్ నెలలో కమిషన్ నిర్వహించనుంది.
షెడ్యూల్ ప్రకారం కంప్యూటర్ ఆధారిత పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 24 వరకు జరగనున్నాయి. సీబీటీ సెషన్-1, సెషన్-2, హవల్దార్ కోసం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET) ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(PST), ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు 1,075 ఉన్న హవల్దార్ పోస్టులకు మరికొన్ని ఖాళీలను కలిపడంతో ఆ పోస్టులు ప్రస్తుతం 1,089కు పెరిగాయి. వాటిని మల్టీ టాస్కింగ్ (నాన్- టెక్నికల్) స్టాఫ్ పోస్టులు 4,375తో కలపడంతో మొత్తం ఖాళీల సంఖ్య 5,464కు పెరిగాయి.
ఎంపిక విధానం ఇలా..
ఎంపిక విధానం మొత్తం మూడు దశల్లో ఉంటుంది. తొలి దశ ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. తరువాత ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST) నిర్వహిస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంటీఎస్, హవల్దార్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ)
హవల్దార్ పోస్టులకు మాత్రమే ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పురుషులు 1600 మీటర్లకు 15 నిమిషాల్లో, మహిళలు ఒక కిలోమీటర్‌కు 20 నిమిషాల్లో పరుగు పందెం నిర్వహిస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ)
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్‌లో అభ్యర్ధుల శారీరక కొలతలు పరీక్షిస్తారు. పురుషుల ఎత్తు 157.5 సెం.మీ ఉండాలి. ఊపిరి పీల్చినప్పుడు ఛాతీ విస్తీర్ణం 5 సెం.మీ పెరగాలి. అలాగే 81 సెం.మీకు తక్కువ కాకుండా ఉండాలి. మహిళల ఎత్తు 152 సెం.మీ, బరువు 48 కిలోల వరకు ఉండాలి.