శ్రీశైలం దేవస్థానం పరిసరాల్లో అన్యమతస్తులకు దుకాణాలు కేటాయించవద్దని 2015లో అప్పటి ఏపీ ప్రభుత్వం జీవో 425 జారీ చేసింది. ఆ జీవోను సవాల్ చేస్తూ పలువురు దుకాణదారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. జీవో 425పై 2020లో స్టే విధించింది. అయితే.. స్టే ఉన్నప్పుటికీ ఏపీ ప్రభుత్వం మళ్లీ టెండర్లు పిలవడంతో శ్రీశైలం ఆలయ పరిధిలోని కొందరు దుకాణదారులు మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లారు. దాంతో.. సుప్రీంకోర్టులో విచారణ జరగ్గా.. దుకాణాల వేలం టెండర్లను పొరపాటున జారీ చేశామని.. ప్రస్తుతం ఆ ఉత్తర్వులను విత్‌డ్రా చేసుకున్నామని ఏపీ ప్రభుత్వం న్యాయవాది తెలిపారు. దీనికి సంబంధించి ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేకుండా శ్రీశైలం టెంపుల్‌తోపాటు స్థానిక అధికారులకు ఉత్తర్వులు ఇస్తామని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. జీవో 425 అమలు చేయొద్దని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.
అలాగే.. శ్రీశైలంలో అన్యమతస్తులకు షాపులు కేటాయించవద్దన్న జీవో నెంబర్ 425పై స్టే కొనసాగుతుందని తెలిపింది. ఇక.. శ్రీశైలంలో అన్యమతస్తులకు షాపులు కేటాయించడంపై హిందూ ధార్మిక సంస్థలు గతంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అన్యమతస్తుల దుకాణాలు వెంటనే తొలగించాలనే డిమాండ్‌తో కూడా ఆందోళనలు చేశాయి. దుకాణాల వేలంలో అన్యమతస్తులు పాల్గొనవద్దని పలు హిందూ సంఘాలు వేలాన్ని కూడా అడ్డుకున్నాయి. దాంతో.. అప్పట్లో ఆ వేలం పాటను అధికారులు నిలిపివేశారు. వివాదం నేపథ్యంలో అన్యమతస్తులకు షాపులు కేటాయించవద్దంటూ ఏపీ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఈ జీవోను దుకాణదారులు సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో స్టే విధించింది.