తెలంగాణలో వరుసగా 4 ఏళ్లు చదివితేనే లోకల్ కోటా వర్తింపు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు

రాష్ట్రంలో స్థానికంగా ఇంటర్‌ వరకు వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వారికే మెడికల్ కాలేజీ కోర్సుల ప్రవేశాల్లో 85 శాతం స్థానిక కోటా అమలు చేస్తామని గతంలో సర్కార్‌ జీవో 33ని జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవో శాశ్వత స్థానికులకు వర్తించదని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిని సమర్థిస్తూ తాజాగా అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాష్ట్ర కోటా కింద మెడికల్‌ కళాశాలల్లో ప్రవేశానికి అర్హత సాధించాలంటే 12వ తరగతికి ముందు తప్పనిసరిగా వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉండాలనే తెలంగాణ ప్రభుత్వ నిబంధనను సుప్రీంకోర్టు సమర్ధిస్తూ సోమవారం (సెప్టెంబర్ 1) తీర్పు ఇచ్చింది..

తెలంగాణలో శాశ్వత నివాసమున్న వారు స్థానిక  కోటా కింద ప్రవేశం పొందడానికి వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదివి ఉండాల్సిన అవసరం లేదన్న హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టేసింది. అయితే ఉద్యోగరీత్యా బదిలీలపై బయటి రాష్ట్రాలకు వెళ్లే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థలు, అఖిల భారత సర్వీసులు, కార్పొరేషన్లు, కేంద్ర సాయుధ బలగాల ఉద్యోగుల పిల్లలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు వర్తిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ మేరకు ధర్మాసనం సోమవారం 32 పేజీల తీర్పు వెలువరించింది. తెలంగాణలో 9 నుండి 12 తరగతులు పూర్తి చేసిన విద్యార్థులు మాత్రమే MBBS, BDS కోర్సులకు స్థానిక అభ్యర్థి కోటా కింద ప్రవేశాలు పొందడానికి అర్హులుగా తేల్చి చెప్పింది.

తెలంగాణ మెడికల్, డెంటల్ కాలేజీల అడ్మిషన్ రూల్స్, (2017 రూల్స్)ను 2024లో సవరిస్తూ తీసుకువచ్చిన జీవో 33ని సవాల్‌ చేస్తూ గతంలో కొందరు విద్యార్ధులు హైదరాబాద్‌లోని హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో పుట్టి పెరిగిన తమను కేవలం వరుసగా 4 ఏళ్లు చదవలేదన్న కారణంతో స్థానికులుగా గుర్తించకపోవడం అన్యాయమని హైకోర్టుకు విన్నవించారు. వారి వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ శ్రీనివాసరావుల నేతృత్వంలోని ధర్మాసనం 2017 రూల్స్‌లోని రూల్‌(3ఏ), 3(ఐఐఐ)లు తెలంగాణ శాశ్వతనివాసులకు వర్తించవని, శాశ్వత నివాసులకు మార్గదర్శకాలను ఖరారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు చెప్పినట్లు చేస్తే అది ఆర్టికల్‌ 371డీ ఉద్దేశాన్ని దెబ్బతీస్తుందని, వైద్య కోర్సుల్లో తెలంగాణవాసులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశమని ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు తెలిపింది. అందువల్ల ఈ కోటా కింద ప్రవేశాలు పొందాలనుకున్నవారు రాష్ట్రంలో తప్పనిసరిగా నివాసం ఉండి, ఇక్కడే ఇంటర్ వరకు చదివి, అర్హత పరీక్ష కూడా ఇక్కడే రాసి ఉండాలని స్పష్టం చేసింది. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 33ని సమర్థించింది.

వైద్య విద్యలో స్థానికతపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర కోటా కింద కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అడ్డంకులు తొలగినట్లైంది. దీంతో ఒకట్రెండు రోజుల్లో మెరిట్‌ జాబితాను వెల్లడించి సెప్టెంబర్‌ 10 నాటికి తొలి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే అఖిల భారత కోటా తొలి విడత కౌన్సెలింగ్‌ పూర్తవగా.. సెప్టెంబర్‌ 4 నుంచి 9 వరకు రెండో విడత కౌన్సెలింగ్‌ జరగనుంది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 61 ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉండగా.. వీటిల్లో 8,340 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక ప్రభుత్వ, 11 ప్రైవేటు డెంటల్‌ కళాశాలల్లో 1,140 సీట్లు ఉన్నాయి.

About Kadam

Check Also

ప్రాణసమానమైన కూతురిపై కేసీఆర్ వేటు వేయడానికి కారణాలు ఇవేనా..?

అనుకున్నంతా అయ్యింది… బీఆర్‌ఎస్‌లో కవిత ప్రస్థానం ముగిసింది. పార్టీని ఇబ్బంది పెట్టేలా ఆమె వ్యవహరిస్తున్న తీరును.. ఇక ఎంతమాత్రం ఉపేక్షించని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *