వృద్ధురాలిపై హత్యాయత్నం కేసును పల్నాడు జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చారు. గొర్రెల దొంగలను కాస్తా బంగారు అభరణాల దొంగలుగా మారినట్లు గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. దొంగలపై హత్యా కేసును నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
పల్నాడు జిల్లా పిడుగరాళ్లకు చెందిన కుంచపు దుర్గా ప్రసాద్, ఎలీశా గుంటూరులోనే నివాసం ఉంటున్నారు. రాత్రి వేళల్లో ఇంటి ముందు కట్టేసిన గేదెలు, పొట్టేళ్లు, గొర్రెలు, ద్విచక్ర వాహానాలు దొంగలించుకెళ్తుంటారు. వీరిద్దరిపై ఇప్పటికే 21 కేసులున్నాయి. అయితే ఆగస్టు నెల 28వ తేదీన కొల్లిపర మండలం అత్తోటలో బుల్లెమ్మ అనే వృద్దురాలిపై దాడి చేసి, పద మూడు లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఎవరూ దొంగతనానికి పాల్పడ్డారో పోలీసులుకు అర్దం కాలేదు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేశారు.
దీంతో సీసీ కెమెరా విజువల్స్‌ను పోలీసులు జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరూ యువకులు గ్రామంలోకి వచ్చినట్లు గుర్తించారు. వారిద్దరూ దుర్గా ప్రసాద్, ఎలీశాగా గుర్తించిన పోలీసులు వారిపై ఉన్న కేసులు వివరాలు తీశారు. జల్సాకు అలవాటు పడిన వీరిద్దరూ గేదెలు, గొర్రెలు, ద్విచక్ర వాహానాలు మాత్రమే దొంగతనం చేసినట్లు రికార్డ్‌ల్లో తేలింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది.
ఎప్పటిలాగే దుర్గా ప్రసాద్, ఎలీశా గొర్రెల చోరికి అత్తోట గ్రామాన్ని ఎంచుకున్నారు. అత్తోట వెళ్లి రెక్కీ నిర్వహించారు. రెక్కీ చేస్తున్న సమయంలోనే బుల్లెమ్మ ఒంటరిగా ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆమె మెడలో గొలుసుతోపాటు చేతులకు బంగారు గాజులు ఉన్నట్లు వారి పరిశీలనలో తేలింది. దీంతో వెంటనే ఆమెపై దాడి చేసి, బంగారు ఆభరణాలను దోచుకోవాలని ప్లాన్ వేశారు. రాడ్ ఒకటి సేకరించి బుల్లెమ్మ ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెపై దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు గొలుసులు, గాజులు, ఇతర ఆభరణాలు తీసుకుని పరారయ్యారని పోలీసులు తెలిపారు.
దొంగలించిన ఆభరణాలను దుర్గా ప్రసాద్ తన భార్య ప్రియాంకకు ఇచ్చాడు. ప్రియాంక కొన్ని ఆభరణాలను విక్రయించగా, మరికొన్ని ఆభరణాలను దాచిపెట్టింది. పోలీసులు దర్యాప్తులో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న తర్వాత ముగ్గురిని అరెస్ట్ చేశారు. దుర్గా ప్రసాద్, ఎలీశాలను సహకరించిన ప్రియాంకపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఒంటరిగా ఉండే వృద్దులు బంగారు ఆభరణాలు ధరించినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు.