హైదరాబాద్‌లో ఇకపై మహిళా పోలీసులు గస్తీ కాయనున్నారు. ఇప్పటికే స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు.. 2 నెలల పాటు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చారు. ధర్నాలు, ర్యాలీలు సహా ఇతర సమయాల్లో ఈ టీమ్స్‌ను మొహరించనున్నారు. తొలిసారిగా ఈ టీమ్ సచివాలయం వద్ద విధులు నిర్వహించింది.
శాంతిభద్రతల పరంగా హైదరాబాద్ చాలా సెన్సిటివ్ ప్రాంతం. ఇక్కడ సెక్యురిటీ బాధ్యతలు పోలీసులకు పెద్ద సవాల్. నిత్యం ఆందోళనలు, ధర్నాలు, రాస్తారొకోలు జరుగుతుంటాయి. చిన్న ఆందోళన లేదా అల్లర్లు జరిగినా అది రాష్ట్రం మొత్తం పాకే అవకాశం ఉండడంతో ప్రతి నిమిషం అలర్ట్‌గా ఉండడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో పోలీస్ వ్యవస్థ వివిధ టీమ్ లను ఏర్పాటు చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఇప్పుడు హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మహిళా పోలీసులు ప్రత్యేకంగా నిలవనున్నారు. ధర్నాలు, ర్యాలీలు జరిగే సందర్భాల్లో ఈ ఉమెన్స్ స్పెషల్ టీమ్స్ విధులు నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రచించారు. దీనికి సంబంధించి రెండు నెలల పాటు వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరికి సాధారణ పోలీస్ యూనిఫాం కాకుండా సరికొత్త డ్రెస్‌ను అందించారు.
హైదరాబాద్ పోలీసులు ఫస్ట్ టైమ్ స్విఫ్ట్ ఉమెన్ యాక్షన్ టీమ్‌ను ప్రారంభించారు. ఈ బృందంలో 35 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. వీరికి నిరాయుధ పోరాటంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ స్వాట్ బృందాన్ని ప్రధానంగా ధర్నాలు, ర్యాలీలు, ఇతర బహిరంగ సభలలో మహిళా నిరసనకారులను సమర్థవంతంగా అడ్డుకునేందుకు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరంలో జరిగే ముఖ్యమైన కార్యక్రమాలు, పండుగల సమయాల్లో వీరిని మోహరించనున్నారు.
రెండు నెలల ప్రత్యేక శిక్షణ తర్వాత స్వాట్ బృందాన్ని జూన్ 3న సీపీ సీవి ఆనంద్ అధికారికంగా ప్రారంభించారు. తాజాగా ఈ టీమ్ తమ కొత్త యూనిఫాం ధరించి.. సచివాలయం వద్ద మొదటిసారి విధులు నిర్వహించింది. హైదరాబాద్ సిటీ పోలీసులకు ధర్నాలు, ర్యాలీ సమయాల్లో మహిళలను నియంత్రించడంలో ఈ బృందం చాలా ఉపయోగపడుతుంది.