టారిఫ్స్, ఇమిగ్రేషన్.. ప్రధాని మోదీ, ట్రంప్ భేటిలో చర్చించే కీలకాంశాలు ఇవే

ఇద్దరు దేశాధినేతలు.. జాన్‌ జిగ్రీ దోస్తులు. సందర్భం వచ్చినప్పుడల్లా మా మంచి మిత్రుడని కితాబిచ్చుకుంటారు. మనం మనం కలిసి ముందుకెళ్దామని చేయి చేయి కలుపుతారు. అలాంటి ఫ్రెండ్స్‌ మరోసారి భేటీ కాబోతున్నారు. ఇంతకీ ఆ దేశాధినేతలు ఎవరు? వాళ్ల మధ్య ఉన్న ఫ్రెండ్‌ షిప్ ఏంటి? సమావేశంలో చర్చకొచ్చే అంశాలేంటి?

ప్రధాని మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లారు. ట్రంప్ ఎన్నికల విజయం.. రెండోసారి ప్రమాణ స్వీకారం తర్వాత ఇద్దరు నేతల మధ్య జరిగే తొలి సమావేశం ఇది. అయితే భేటీలో చర్చకొచ్చే అంశాలతో పాటు వాళ్లిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ హాట్‌ టాపిక్‌గా మారింది. దౌత్య సంబంధాలు, దీర్ఘకాలిక మైత్రీ బంధం, దేశాధినేతలతో మర్యాదపూర్వక ప్రవర్తన ఇవేవీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి పట్టవు. మాకేంటి అన్న ధోరణ ఆయనలో కనిపిస్తుంది. కానీ ఇండియా అన్నా.. మోదీ అన్న విపరీతమైన అభిమానం చూపిస్తాడు ట్రంప్‌. భారత్ ప్రస్తావన వస్తే చాలూ.. మోదీతో ఫ్రెండ్‌షిప్‌ను ప్రస్తావిస్తారు. దోస్త్ మేరా దోస్త్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తారు.

ట్రంప్ ఫస్ట్ టర్మ్‌ నుంచే మోదీతో బలమైన స్నేహబంధాన్ని కొనసాగిస్తున్నారు. 2017, జూన్‌లో వైట్‌ హౌస్‌లో ట్రంప్‌తో కలిసి విందు చేసిన మొదటి విదేశీ నాయకుడు మోదీనే. ఏది సరైనదో అదే మోదీ చేస్తారని చెబుతుంటాడు ట్రంప్‌. ట్రంప్‌ రెండోసారి ప్రమాణం చేశాక మోదీ కాల్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం, ఇండో పసిఫిక్, పశ్చిమాసియా, ఐరోపాలో భద్రత లాంటి అంశాలపై చర్చించారు. అంతకుముందు ట్రంప్‌.. మై ఫ్రెండ్ అంటూ మోదీ ఎక్స్‌లో శుభాకాంక్షలు తెలిపారు. గతంలో మీ పాలనలో సాధించిన విజయాలకు కొనసాగింపుగా భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం అయ్యేలా కలిసి పనిచేయాలని ఆశిస్తున్నానని ఎక్స్‌లో పేర్కొన్నారు. ఎన్నికల్లో విజయం సాధించాక తనతో మాట్లాడిన తొలి విదేశీ నేత మోదీ అని గుర్తు చేశారు ట్రంప్‌.

గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ షోలో పాల్గొన్నారు ట్రంప్‌. అందులో మోదీ గురించి గొప్పగా మాట్లాడారు. మంచి మానవత్వం ఉన్న ఫ్రెండ్‌ మోదీ ఆకాశానికెత్తేశారు. టెక్సాస్‌లో హౌడీ మోడీ సభకు వేల మంది వచ్చారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాధినేతలు పాల్గొన్న సభగా నిలిచిపోయింది. అదే ఎన్నికల ప్రచారంలో భారత్‌ బాసటగా నిలిచారు ట్రంప్‌. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న అనాగరిక హింసను ఎక్స్‌లో ఖండించారు. ఎన్నికల్లో గెలిస్తే.. తన మంచి మిత్రుడు మోదీతో అమెరికా భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తానని వాగ్దానం చేశారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై దాడి ఘటనపై మోదీ స్పందించారు. రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదు.. ఫ్రెండ్‌ ట్రంప్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 2020లో ట్రంప్ తన సతీమణి, కుమార్తె, అల్లుడితో కలిసి భారత్ పర్యటనకు వచ్చారు. ట్రంప్ రాకను స్వాగతిస్తూ అహ్మాదాబాద్‌లో పెద్ద సంఖ్యలో జనం స్వాగతం పలికారు. బహిరంగ సభలో ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు మోదీ. రెండు దేశాల పరస్పర స్నేహబంధంపై మాట్లాడారు. ఆ వీడియోను ట్రంప్ ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారు. మోదీ నమ్మకమైన మిత్రుడు అని ట్రంప్ కొనియాడారు. సందర్భం ఏదైనా.. వేదిక ఎక్కడైనా.. ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఏ స్థాయిలో ఉందో చాటుకుంటారు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ఏయే అంశాలు చర్చకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

అక్రమ వలసదారులు, హెచ్‌1బీ వీసాల అంశం మోదీ-ట్రంప్ మధ్య ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను ఈ మధ్య సైనిక విమానంలో ఇండియాకు పంపించారు. భారతీయులకు అమెరికా వీసాలను తగ్గిస్తుందన్న వార్తలు వినిపిస్తున్న వేళ.. అలాంటివి జరగకుండా ట్రంప్‌తో మోదీ చర్చించే చాన్స్ ఉంది. హెచ్‌1బీ వీసాలు, విద్యార్థి వీసాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంప్రదింపులు జరుపుతారని తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య వ్యాపారం, పన్ను రాయితీ అంశాలు చర్చకు వస్తాయని సమాచారం. భారత్‌-అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలే కాకుండా భౌగోళిక రాజకీయ పరిస్థితుపైనా చర్చించనున్నారు. మొత్తానికి ఈ భేటీపై భారత్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

About Kadam

Check Also

PMO, పార్లమెంట్ హౌస్‌లో ఏర్పాటు చేయబోతున్న వేద గడియారం.. దీని ప్రత్యేకమేంటంటే

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఆధునిక వేద గడియారాలు తయారవుతున్నాయి. ఇవి హిందీ, ఇంగ్లీషులో మాత్రమే కాకుండా 189 భాషలలో సమయాన్ని తెలియజేస్తాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *