ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యే హత్యకు కుట్ర జరగడం సంచలనం సృష్టిస్తోంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర జరిగింది. ఇందుకు సంబంధించి సంచలన వీడియో బయటపడింది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ వీడియోలో చర్చలు జరిపారు పలువురు రౌడీ షీటర్లు.. కోటంరెడ్డిని చంపేందుకు ఐదుగురు రౌడీషీటర్ల మాస్టర్ ప్లాన్ రచించారు. ఈ హత్య ప్లాన్ వెనుక రౌడీషీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నారు. మద్యం సేవించి ప్లాన్ గురించి చర్చించిన జగదీష్, మహేష్, వినీత్ సహా మరో ఇద్దరు చర్చించుకున్నారు. కాగా.. ఈ వీడియో బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఇక 5 రోజుల కిందటే ఈ విషయం పోలీసులకు తెలిసినా స్పందించలేదని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే హత్యకు ప్లాన్ చేసిన వీడియోపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్న అంశం తమ దృష్టిలో ఉందన్నారు. ఈ అంశంపై విచారణ జరుపుతున్నామని.. త్వరలో పూర్తి విషయాలు చెబుతామని ఎస్పీ తెలిపారు.