రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న వన మహోత్సవం నేడు ప్రారంభం కానుంది. ‘వన మహోత్సవం-2025’ కార్యక్రమానికి ప్రభుత్వం ఇవాళ్టి నుంచి శ్రీకారం చుట్టనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమానికి రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శ్రీకారం చుట్టనున్నారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, అటవీ దళాల ప్రధానాధికారి సువర్ణ, అధికారులు పాల్గొంటారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏటా జూలై మొదటి వారంలో నిర్వహిస్తోంది.
ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలను నాటాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో అత్యధికంగా పంచాయతీరాజ్ శాఖ 7 కోట్లు, పురపాలక శాఖ 8 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఆయా శాఖలు, జిల్లాల వారీగా పలు లక్ష్యాల్ని నిర్దేశించింది. అటవీ, వ్యవసాయ శాఖలు కూడా కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. గత ఏడాది 20 కోట్లు మొక్కలు నాటాలన్నది లక్ష్యం కాగా.. అందు లో 95ు మొక్కలు నాటారు. ఈ ఏడాది 100ు లక్ష్య సాధనకు కృషి చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. వన మహోత్సవం కోసం 14,355 నర్సరీల్లో 20 కోట్ల మొక్కలు సిద్థం గా ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ సారి వన మహోత్సవంలో పది ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలను నిర్దేశించారు. వేప, గుల్‌మొహర్, సీతాఫలం, అల్ల నేరేడు, చింత, కానుగ తదితర మొక్కలతో పాటు ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు మామిడి, జామ, కొబ్బరి, మునగ, డ్రాగన్ ఫ్రూట్, నిమ్మ మొక్కలను నాటనున్నారు. ప్రభుత్వ స్థలాలు, కమ్యూనిటీ, అవెన్యూ, రైతుల, చెరువుల పొలం గట్లపై నాటేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేయనున్నారు.