తెలంగాణలో అవినీతిని అరికట్టడంలో ఏసీబీ దూకుడుగా ముందుకు సాగుతోంది. గత ఎనిమిది నెలల్లోనే ఏసీబీ మొత్తం 179 కేసులు నమోదు చేసి, ప్రభుత్వ లంచగొండ్లపై ఉక్కుపాదం మోపింది. ఇప్పటి వరకు లంచం తీసుకున్న 167 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేసింది. అందులోనూ 108 మందిని స్వయంగా లంచం తీసుకుంటున్నప్పుడే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం విశేషం. ఈ ఆపరేషన్లలో ఏసీబీ అధికారులు 33.12 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఇదే కాకుండా లంచాలు తీసుకుంటూ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాధించిన వారికి కూడా ఏసీబీ చెక్ పెట్టింది. ఈ కేసుల్లో కూడా ఏసీబీ గట్టి చర్యలు తీసుకుంది. గడిచిన ఎనిమిది నెలల వ్యవధిలో ఈ కేసుల్లో మొత్తం 11 మంది అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది, వారి వద్ద ఉన్న రూ.44.30 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే కాకుండా, అవినీతికి పాల్పడిన ప్రైవేట్ ఉద్యోగులను సైతం ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపుతుంది. ఇదిలా ఉండగా కేవలం గత ఆగస్టు నెలలోనే 31 మంది అవినీతి అధికారులపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో పట్టుబడిన వారిలో 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా నలుగురు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే రోజురోజుకూ రాష్ట్రంలో అవినీతి అధికారులు పెరుగుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులు వారికి కీలక హెచ్చరికలు జారీ చేశారు. అవినీతి తాలూకు కేసుల్లో ఎవరూ తప్పించుకోలేరని. లంచం తీసుకుంటే ఎవరూ పట్టుబడిని వారిని ఉపేక్షించేదే లేదని తేల్చి చెప్పారు. ఒక వేళ మీరు లంచం తీసుకుంటున్నట్టయితే ఎప్పటికైనా తమను వదిలేది లేదని ఏసీబీ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేయాలని సూచించింది.