తెలంగాణ అంగన్‌వాడీల్లో త్వరలో జొన్న రొట్టెలు, ఇతర పోషకాహారాలు అందించే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. కర్ణాటక మోడల్‌ను అధ్యయనం చేసేందుకు సెర్ప్ బృందం అక్కడికి వెళ్లనుంది. మహిళా సంఘాల ద్వారా జొన్నలతో చేసిన ఆహారం సరఫరా చేయాలని కసరత్తు చేస్తోంది. అటు పిల్లలకు పోషకాహారం అందించడంతో పాటు జొన్న సాగుకు ఇది కొత్త ఊపునిచ్చే అంశం.
తెలంగాణ అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం అందిస్తున్న పోషకాహారంతో పాటు జొన్నతో తయారయ్యే రొట్టె, ఇతర పదార్థాలను అందించే దిశగా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. కర్ణాటకలో ఇప్పటికే అమలులో ఉన్న పోషకాహార మోడల్ ఆధారంగా ఇక్కడ కూడా అలాంటి ఏర్పాటు చేయాలని సీఎం ఇటీవల సమీక్షలో సూచించారు. మహిళా సంఘాల సాయంతో ఈ పదార్థాలను తయారుచేయించి… సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.
ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పొడవునా 300 రోజులు జొన్నతో చేసిన ఉప్మా, రొట్టె, లడ్డూ, చిక్కీ, కిచిడీ వంటి పదార్థాలను అంగన్‌వాడీల్లో అందిస్తోంది. ఈ విధానాన్ని పరిశీలించేందుకు త్వరలో తెలంగాణ ప్రభుత్వం తరఫున స్త్రీ, శిశు సంక్షేమ, పేదరిక నిర్మూలన సంస్థ నుంచి ఒక టీమ్‌ను కర్ణాటకకు పంపనుంది. అక్కడ అధ్యయనం చేసి, రిపోర్ట్ ఇచ్చిన తరువాత అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు.
మన పూర్వికులు జొన్న అన్నం తిని చాలా ధృడంగా ఉండేవారు. మళ్లీ ఇప్పుడు జొన్నలు వైపు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జొన్న వినియోగం క్రమంగా పెరుగడంతో.. సాగు విస్తీర్ణం కూడా వృద్ధి చెందుతోంది. వానాకాలంలో 50 వేల ఎకరాలు, యాసంగి కాలంలో 4 లక్షల ఎకరాలు సాగు జరుగుతోంది. అంగన్‌వాడీల్లో జొన్న ఆధారిత ఆహార పథకం అమలు చేస్తే జొన్న రైతులకు మరింత ప్రొత్సాహకం లభిస్తుంది. అధికారుల వివరాల ప్రకారం.. జొన్న రొట్టెలు మహిళలు, టీనేజ్ బాలికలకు.. ఇతర పదార్థాలను చిన్నారులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.