తెలంగాణ స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ నిర్ణయం కీలకం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం తెలిపితేనే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ గవర్నర్ తిరస్కరించడమో లేక అభ్యంతరాలు వ్యక్తం చేస్తే రిజర్వేషన్ల పెంపు నిలిచిపోయే ప్రమాదం ఉంది. మరి ఈ ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం పెడతారా…? లేక న్యాయ, రాజ్యాంగ పరిశీలనకు పంపుతారా…? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ రాజ్యాంగ పరిశీలనకు పంపిస్తే మాత్రం నిర్ణయం తీసుకునేందుకు కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. గవర్నర్ ఆర్డినెన్స్‌ను తిరస్కరిస్తే పరిస్థితి ఏమిటీ, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై కూడా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తెలంగాణలో పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చడాన్ని తాము ఒప్పుకోబోమని, ఆ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిస్తే తిరస్కరిస్తామని తెలంగాణ బీజేపీ చెబుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు పేరుతో ముస్లింలకు 10% రిజర్వేషన్లు అమలు చేయడం దుర్మార్గమని మండిపడుతున్నారు. ముస్లింలను బీసీ రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని తెలంగాణ బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
ఇటు ప్రభుత్వం మాత్రం… స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని సీరియస్‌గా తీసుకొని.. మరింత వేగంగా ముందుకెళ్తోంది. అందులోభాగంగానే ఆర్డినెన్స్ ఫైల్ రాజ్‌భవన్‌కు వెళ్లింది. సంబంధిత మంత్రి, సీఎం సంతకాలు చేసి గవర్నర్ జిష్ణుదేవ్ శర్మకు ఆర్డినెన్స్ ఫైల్‌ను పంపారు. 285(A) సెక్షన్‌లో సవరణ చేస్తూ… ఎటువంటి లీగల్ చిక్కులు రాకండా ముసాయిదా డ్రాఫ్డ్‌ను గవర్నర్‌కు పంపారు. గవర్నర్ నుంచి ఆమోదం రాగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. అయితే గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.