వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ సిలబస్ మారుతుందన్న ప్రచారంపై తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య క్లారిటీ ఇచ్చారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మార్పు నిజమేనంటూ ఆయన తేల్చి చెప్పారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి మారిన సిలబస్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. అయితే పదేళ్ల నుంచి ఒకటే సిలబస్ ఉండటంతో జాతీయ విద్యావిధానంకు అనుగుణంగా మార్పులు చేయడం అనివార్యమైందన్నారు.
ఇంటర్ సిలబస్ మార్పుపై సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్స్ కమిటీని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీలో పదో తరగతి పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ క్లాసులు చెప్పే లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉన్నారు. వీరంతా అధ్యయనం చేసి ఇంటర్ సిలబస్ మార్పులపై ప్రభుత్వానికి తుది నివేదిక అందజేశారు. ప్రస్తుతం ఉన్న సిలబస్ స్థానంలో కీలక సూచనలు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాక, ఇంటర్ బోర్డు అధికారికంగా సిలబస్‌ను ప్రకటించనుంది.
ఇంటర్ కొత్త సిలబస్‌లో తెలంగాణ చరిత్రను అడాప్ట్ చేసుకునే వీలుంది. అదే విధంగా సైన్స్, మ్యాథ్స్ విద్యార్థుల కోసం స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ సిలబస్‌ను జోడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీట్ కోసం ప్రత్యేకంగా వేరే సబ్జెక్ట్‌లు విద్యార్థులు ప్రిపేర్ అవుతున్న వేళ అలాంటి వాటికి చెక్ పెట్టేలా మార్పులు ఉండనున్నాయి. అయితే ఇంటర్ సిలబస్‌లో సెకెండ్ లాంగ్వేజ్‌గా సంస్కృతంను తీసుకొచ్చామన్నది అవాస్తమని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. ఇటీవల ప్రభుత్వం నుంచి సంస్కృతం లాంగ్వేజ్ రిక్వైర్‌మెంట్‌ను తెలుసుకోవాలని ఆదేశాలు వచ్చాయన్నారు. దాని ఆధారంగా కాలేజీల నుంచి సమాచారం తీసుకునేందుకు ప్రిన్సిపాల్స్‌కు సర్కూలర్ జారీ చేశామన్నారు. కేవలం అభిప్రాయ సేకరణ కోసం ఇచ్చిన సర్కూలర్ పై సంస్కృతంను తెలుగు స్థానంలో తీసుకొచ్చామని అబద్ధం ప్రచారం చేస్తున్నారని కృష్ణ ఆదిత్య తెలిపారు.
Amaravati News Navyandhra First Digital News Portal