అతనేమీ హంతకుడు కాదు. ఉగ్రవాది అంతకన్నా కాదు.. అతనో అన్నదాత.. ఆయన తన భూమిని కాపాడుకునే క్రమంలో జైలుకు వెళ్లిన లగచర్ల రైతు.. లగచర్ల రైతుకు గుండెపోటు వస్తే పోలీసులు బేడీలు వేసి ఆస్పత్రికి తరలించడం తెలంగాణలో కలకలం రేపింది.
పైన ఫోటోలో మనం చూస్తున్న రైతు పేరు హీర్యానాయక్. ఈయనకు గుండెపోటు వస్తే పోలీసులు సంకెళ్లు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. రైతుకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. రైతుకు సంకెళ్లు వేసి ఆస్పత్రికి తరలించడంపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు మండిపడ్డారు. సంకెళ్లు వేసి తీసుకెళ్లడానికి హీర్యానాయక్ ఏమైనా ఉగ్రవాదా అని ప్రశ్నించారు హరీశ్‌రావు.
గుండెపోటు వస్తే కరుడుగట్టిన నేరస్తుడిని సైతం అంబులెన్స్‌లో తరలిస్తారని.. అలాంటిది అన్నదాతకు హార్ట్ ఎటాక్ వస్తే సంకెళ్లు వేసి పోలీస్ వాహనంలో తరలించడం అమానవీయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. రాష్ట్ర గవర్నర్ ఈ అంశంపై విచారణకు ఆదేశించాలన్నారు. రాహుల్ గాంధీకి నిజంగా హృదయం ఉంటే, గిరిజనులపై ప్రేమ ఉంటే గిరిజన రైతులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించాలన్నారు. లగచర్ల గిరిజన రైతుకు బేడీలు వేయడంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేయడమే రైతు రాజ్యమా అని నిలదీశారు.
ఘటనపై సీఎం సీరియస్…
లగచర్ల రైతుకు సంకెళ్లు వేసి ఆస్పత్రికి తరలించడంపై విమర్శలు వెల్లువెత్తడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు సంకెళ్లు వేయడంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలను ప్రజా ప్రభుత్వం ఉపేక్షించదన్నారు రేవంత్ రెడ్డి. కాగా లగచర్ల దాడి ఘటనలో అరెస్టయిన 45 మంది రైతులు.. సుమారు 30 రోజులుగా.. సంగారెడ్డి జైలులో ఉంటున్న విషయం తెలిసిందే.