శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీళ్లన్నీ తమకే చెందుతాయని తెలంగాణ కేఆర్‌ఎంబీకి లేఖ రాసింది. ఏపీ ఇప్పటికే తన వాటాకు మించి వాడుకుందని, ఈ పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరింది.
నాగార్జునసాగర్ నుంచి, శ్రీశైలం నుంచి ఏపీ ఇప్పటికీ నీటిని తీసుకుంటోందని, ఆ రాష్ట్రానికి కేటాయించిన దానికంటే మించి వాడుకొన్నా మళ్లీ నీటి వినియోగ ప్రణాళిక ఇమ్మని రెండు రాష్ట్రాలను కోరడం ఏంటి ప్రశ్నిస్తూ తెలంగాణ నీటిపారుదల శాఖ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఫిబ్రవరి 11 వరకు నీటి వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొంటే.. ఆంధ్రప్రదేశ్‌కు 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల మిగులు ఉందని.. ఈ నీటి వినియోగానికి ప్రణాళిక ఇవ్వాలని కోరింది బోర్డు. అయితే రెండు రిజర్వాయర్లలో కలిపి ఉన్నది 94.4 టీఎంసీలు అయితే రెండు రాష్ట్రాలకు కలిపి 158.78 టీఎంసీల నీరెక్కడి నుంచి వస్తుందని రివర్స్‌లో తెలంగాణ లేఖ రాసింది. కేటాయించిన దానికంటే 64 టీఎంసీలు తక్కువగా ఉందని తెలిపింది తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి ఎక్కువగా నీటిని వాడుకోవడం వల్లే ఇలా జరిగిందని వివరించింది.
ఉమ్మడి రిజర్వాయర్లలో ఎవరికి ఎన్ని నీళ్లున్నాయో చెప్పకుండా నీటి వినియోగ ప్రణాళిక ఇమ్మని బోర్డు కోరడం ఏ మాత్రం సమంజసం కాదని తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడింది. తుంగభద్ర, సుంకేశుల, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, గాజుల దిన్నెలో ఉన్న 51.756 టీఎంసీల నుంచి ఆంధ్రప్రదేశ్ 27.03 టీఎంసీలు వాడుకోవాలి తప్ప ఉమ్మడి రిజర్వాయర్లయిన శ్రీశైలం, సాగర్‌ల నుంచి కాదని పేర్కొంది. ఇప్పటికే 36.67 టీఎంసీలు ఎక్కువగా వాడుకుందని.. వెంటనే తేరుకోవాలంది తెలంగాణ.