రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల (సీపీగెట్) ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ర్యాంకు కార్డులను వెబ్సైట్లో అందుబాటులో..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 యూనివర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షల (సీపీగెట్) ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు ర్యాంకు కార్డులను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 54,692 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. ఇక ఈ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్)లో 93.83 శాతం మంది అర్హత సాధించారు. మొత్తం 44 సబ్జెక్టులకు గానూ గత నెలలో రాత పరీక్షలు నిర్వహించారు. వీరిలో 51,317 మంది ఉత్తీర్ణత సాధించారు. కన్వీనర్ కోటా కింద ఆయా పీజీ కోర్సుల్లో సీట్లు పొందేందుకు సెప్టెంబరు 10 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి అన్నారు. మొత్తం 253 కాలేజీల్లో 41,709 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
టీజీ సీపీగెట్-2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదీ…
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు: సెప్టెంబర్ 10 నుంచి15 వరకు
- వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ: సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు
- తొలి విడత సీట్ల కేటాయింపు తేదీ: సెప్టెంబర్ 24వ తేదీ
- కళాశాలల్లో రిపోర్ట్ తేదీ: సెప్టెంబర్ 27వ తేదీలోపు
- రెండో విడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు: సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం
ఏపీ పీజీ సెట్ 2025 కౌన్సెలింగ్ ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్ పీజీ సెట్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ సెప్టెంబరు 8 నుంచి ప్రారంభమైంది. మొత్తం రెండు విడతల్లో చేపట్టనున్న ఈ కౌన్సెలింగ్ తొలి విడత రిజిస్ట్రేషన్లు సెప్టెంబరు 15 వరకు జరుగుతాయి. ధ్రువపత్రాల పరిశీలనకు సెప్టెంబర్ 9 నుంచి16 వరకు, వెబ్ ఐచ్ఛికాల నమోదుకు సెప్టెంబర్ 12 నుంచి 17 వరకు అవకాశం ఇచ్చారు. వెబ్ ఐచ్ఛికాల్లో మార్పులు చేర్పులు సెప్టెంబర్ 18న చేసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 20న సీట్లు కేటాయిస్తారు. ఆయా కళాశాలల్లో సీట్లు పొందిన వారు 22 నుంచి 24 లోపు చేరాల్సి ఉంటుంది. అనంతరం రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.