రాష్ట్రానికి మరో మణిహారం.. యాదాద్రి పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ జాతికి అంకితం!

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రాష్ట్రానికి ఆశాదీపమైంది. దీంతో విద్యుత్తు సరఫరాలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్‌వన్‌ స్థానంలో నిలువనుంది. సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద థర్మల్‌ విద్యుత్ కేంద్రంగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అవతరించింది. దేశ విద్యుత్ రంగానికి దేశానికి కలికితురాయిగా నిలిచిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ మొదటి యూనిట్ ను ప్రభుత్వం జాతికి అంకితం చేసింది. గత ఏడాది డిసెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి రెండవ యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. మొదటి, రెండో యూనిట్ల నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తితో కాంతులు విరజిమ్ముతున్నాయి.

రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేకుండా నిరంతరాయంగా వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేసి మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS) ను ప్రభుత్వం చేపట్టింది. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో YTPS నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. 34,500 కోట్లతో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టింది. దక్షిణాదిలో ప్రభుత్వ రంగంలో అతిపెద్దదైన యాదాద్రి పవర్‌ ప్లాంట్‌.. మొదటి, రెండో యూనిట్ల నుంచి పూర్తి స్థాయిలో కాంతులు విరజిమ్మనుంది. ప్లాంట్‌ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సందర్శించి అధికారులతో ఎప్పటికప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షించారు.

దశల వారీగా పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తినీ ప్రభుత్వం జాతికి అంకితం చేస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి,అడ్లూరి లక్ష్మణ్ లు పవర్ ప్లాంట్ ను సందర్శించారు. మొదటి యూనిట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతికి అంకితం చేసి కమర్షియల్ ఆపరేషన్ డిక్లరేషన్(COD) చేశారు. ఇప్పటికే రెండో యూనిట్ ను గత ఏడాది డిసెంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ప్లాంట్ లో రెండు యూనిట్లను వాడకంలోకి తీసుకురాగా.. 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. యాదాద్రి పవర్ ప్లాంట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. జెన్ కో అధికారులు పవర్ ప్లాంట్ పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్ కు శంకుస్థాపన..

పవర్ ప్లాంట్ ఆవరణలో రూ.928.52 కోట్ల అంచనాతో చేపట్టనున్న ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌ షిప్ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. మొత్తం 3,52,771.02 చ.మీ.ల విస్తీర్ణంలో టౌన్‌ షిప్‌ నిర్మాణం జరగనుండగా, 2,21,903.67 చ.మీ.ల విస్తీర్ణంలో నివాస గృహ సముదాయాలతో టౌన్ షిప్ ను నిర్మించనున్నారు. పవర్ ప్లాంట్ పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే 2026 మార్చి నాటికి వేల సంఖ్యలో ఇంజనీరింగ్‌ అధికారులు, ఉద్యోగులు, ఇతర కార్మికులు ఇక్కడ రాత్రింబవళ్లు పని చేయనున్నారు. వీరంతా తప్పనిసరిగా స్థానికంగా నివాసం ఉండాల్సి రావడంతో టౌన్‌షి్‌పను జెన్‌కో నిర్మిస్తోంది. 11 అంతస్తుల బహుళ అంతస్తుల సముదాయాల్లో ఈ క్వార్టర్లు ఉండనున్నాయి. ప్లాంట్ లోని మూడో యూనిట్‌ రానున్న ఆగస్టు కల్లా, నాలుగో యూనిట్‌ అక్టోబర్ కల్లా, ఐదో యూనిట్‌ 2026 మార్చి కల్లా పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తి(సీవోడీ) ప్రారంభించాలని జెన్ కో లక్ష్యంగా పెట్టుకుంది. ఒకేచోట 4 వేల మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ కలిగిన ప్రాంతంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం రికార్డులకు ఎక్కనుంది.


About Kadam

Check Also

వామ్మో మరీ అంతనా.. ఆ స్కూల్‌లో నర్సరీ ఫీజ్‌ ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లకు బదులుగా ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. డిమాండ్‌ పెరగడంతో ప్రైవేటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *