తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీ సెట్ 2025) పరీక్షను ఈసారి కాస్త ముందుగానే జరపాలని ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లోనే ఈఏపీ సెట్ 2025 నిర్వహించనున్నట్లు గతంలో తెల్పింది కూడా. కానీ ఈ ఆలోచన కార్యరూపం దాల్చేలా కనిపించడం లేదు. ఈఏపీ సెట్‌ను ముందుకు జరపటం అసాధ్యమని పరీక్ష నిర్వహణ కన్సల్టెన్సీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)కి తెల్పినట్లు సమాచారం. ఏప్రిల్ నెలలో జరగనున్న జాతీయ, రాష్ట్ర పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఈఏపీ సెట్ తేదీని గత ఏడాదికన్నా ముందుకు జరపడం సాధ్యంకాదని, ప్రధాన పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే ఈఏపీ సెట్ తేదీని ఖరారు చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి టీసీఎస్ ప్రతినిధులు సూచించినట్లు తెలిసింది.
సాధారణంగా వివిధ పరీక్ష తేదీలను పరిశీలించి టీసీఎస్ సెట్ తేదీని మండలికి సూచించడం ఆనవాయితీగా జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి పరీక్షలు మొదలవుతాయి. ఇంటర్మీడియెట్, టెన్త్ పరీక్షలు మార్చి రెండో వారం నాటికి పూర్తవుతాయి. ఈ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ తర్వాత ఈఏపీ సెట్‌కు సన్నద్ధమవ్వడానికి విద్యార్థులకు సమయం అవసరం అవుతుంది. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఏప్రిల్ 1వ తేదీ నుంచి 8 వరకు నిర్వహిస్తున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్ మే 18న జరగనుంది. దీని తర్వాత ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. ఏటా ఈ కౌన్సెలింగ్ పూర్తయ్యే సమయంలో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చేపడుతుంటారు. జాతీయ కాలేజీల్లో సీట్లు రాని వారికి ఈఏపీసెట్‌లో వచ్చిన ర్యాంకు ఉపయోగపడుతుంది.
వీటిని పరిగణనలోకి తీసుకోకుండానే ఈఏపీ సెట్‌ను ఏప్రిల్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావించింది. ఇది జరిగితే జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ రాసే విద్యార్థుల్లో గందరగోళం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. అందుకే జేఈఈ అడ్వాన్స్‌డ్ తర్వాతే ఎప్పటి మాదిరిగానే ఈఏపీ సెట్ నిర్వహించాలని టీసీఎస్ భావిస్తుంది. అయితే ఈఏపీ సెట్ 2025 పరీక్ష తేదీ విషయంలో అంతిమంగా ఉన్నత విద్యామండలి నిర్ణయం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.