ఒకే ఒక అస్తికయినా ఇవ్వండి – 8 మంది కార్మికుల కుటుంబాల ఆవేదన

కార్మికుల అవశేషాలను గుర్తించేందుకు NDRF, హైడ్రా, మున్సిపల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, రక్తంతో ఉన్న రాళ్లను సేకరించి.. 70కిపైకి శాంపిల్స్‌ను DNA రిపోర్ట్‌ల కోసం అధికారులు పంపించారు. 8 మంది ఆచూకీ గుర్తించడంలో DNA రిపోర్ట్‌లు కీలకంగా మారనున్నాయి. ఐలా సెంటర్ దగ్గర తమ వారి కోసం 8 రోజులుగా కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.

సిగాచి పరిశ్రమ లాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదు. ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం వచ్చిన కార్మికులు అగ్నికి ఆహుతి అయ్యారు. చెట్టంత మనిషిని, చివరికి మాంసం ముద్దలాగా ఓ చిన్న పెట్టెలో పెట్టి ఇస్తే ఆ కుటుంబ సభ్యుల ఆవేదన అంతా ఇంతా కాదు. సిగాచి ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన వారి వేదన మాటల్లో వర్ణించలేం. మరణించిన వారిని కడసారి చూసుకునే అవకాశమూ దక్కలేదని చాలా మంది తల్లిడిల్లుతున్నారు. ఇప్పటి వరకు 42 మంది చనిపోయారని అధికారులు ప్రకటించారు. వీరిలో అత్యధికుల మృతదేహాలను వస్త్రాల్లో కట్టి ఇచ్చేశారు. ముఖాలనూ గుర్తుపట్టలేని పరిస్థితి ఉండటంతో.. అలాగే తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. ఈ ప్రమాదంలో ఆచూకీ గల్లంతయిన తొమ్మిది మందికి సంబంధించి కేవలం ఎముకలు, ఇతరత్రా అవశేషాలు మాత్రమే దొరికాయి. ఒకే ఒక్క అస్తిక ఇచ్చినా, అంత్యక్రియలు నిర్వహించి, వారి ఆత్మలు శాంతించేలా చూస్తామని కుటుంబసభ్యులు రోదిస్తూ వేడుకుంటున్నారు.

ప్రమాదస్థలిలోని శిథిలాలను అధికారులు జల్లెడ పట్టారు. మట్టిని కూడా తవ్విపోశారు. ఎట్టకేలకు పదుల సంఖ్యలో ఎముకలు, ఇతర అవశేషాలను సేకరించారు. డీఎన్​ఏ పరీక్షలకు పంపారు. ఆ ఫలితాలను రక్తసంబంధీకుల డీఏఎన్​ తో మ్యాచ్​ చేస్తున్నారు. తొమ్మిది మంది ఆచూకీ దొరక్కపోగా.. వారిలో కేవలం ఒకే ఒక్కరి డీఎన్​ఏ అవశేషాలతో సరిపోయింది. దొరికిన ఎముక యూపీకి చెందిన చికెన్​ సింగ్ దేనని అధికారులు ప్రకటించారు. మిగతా ఎనిమిది మంది గురించి నిర్ధారించాల్సి ఉంది. ప్రమాదస్థలిలో సేకరించిన అవశేషాలు, ఎనిమిది మంది కుటుంబసభ్యుల నుంచి రెండు దఫాలుగా తీసుకున్న బ్లడ్​ శాంపిల్స్​ కు సంబంధించిన విశ్లేషణ కొనసాగుతోంది. ‘ఏదో ఒక గురుతు ఇవ్వండి. ఒకే ఒక్క అస్తికయినా మాకు చాలు. మా కుటుంబసభ్యుడిని తలచుకొని తనివితీరా ఏడుస్తాం. అలా కాకుండా చనిపోయారని ప్రకటిస్తే, ఆ వేదన మేం భరించలే’మంటూ వారి కుటుంబ సభ్యులు, బంధువులు చెబుతున్నారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *