తెలంగాణలో వరద బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.. దీంతో పలు జిల్లాల్లో అపారనష్టం జరిగింది. ఇళ్లు, పంటలు నీటమునిగాయి.. ఇప్పుడిప్పుడే ప్రభావిత ప్రాంతాలు కోలుకుంటున్నాయి.. ఈ తరుణంలో వరదలు, పంట నష్టంపై మరోసారి సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మృతుల కుటుంబాలకు పరిహారంతో పాటు పలు అంశాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం. వరద మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మృతి చెందిన పశువులకు కూడా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇంకా వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణలోనే పలు జిల్లాల్లో ఇటీవల భారీ వర్షాలు వరద నష్టాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత ఏడాది భారీ వర్షాలకు జరిగిన నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై అధికారులను ఆరా తీశారు సీఎం. ఈ విషయాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో చెరువుల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు.
హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల నోటిఫై వెంటనే జరగాలని తెలిపారు. ఇప్పటివరకు విపత్తు నిర్వహణ నిధుల కింద చేపట్టిన పనుల వివరాలతో కలెక్టర్లు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వర్షాలు వరదల కారణంగా జరిగిన పంట నష్టం అంచనా వేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. గత సంవత్సరం ఏర్పాటు చేసిన ఎస్డీఆర్ఎఫ్ ఈ వరదల సమయంలో బాగా పనిచేసిందని ముఖ్యమంత్రి కితాబిచ్చారు.