తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీయేటా వివిధ రంగాల్లో విశేష కృషి అందించిన సంస్థలు, వ్యక్తులకు గవర్నర్ ప్రతిభా పురస్కారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి కూడా అవార్డులను ప్రధానం చేయనుంది. జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా వీటిని ప్రధానం చేయనున్నారు. మొత్తం జాబితా ఈ కింద తెలుసుకోవచ్చు..
వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు అందించే గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను తెలంగాణ గవర్నర్ కార్యాలయం తాజాగా ప్రకటించింది. ఈ అవార్డులకు మొత్తం 8 మంది ఎంపికైనట్లు వెల్లడించింది. ఈ మేరకు జాబితాను వెల్లడించింది. కాగా వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం యేటా ప్రదానం చేస్తుంది. జనవరి 26న గణతంత్ర్య దినోత్సవం వేడుకల సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ అవార్డులను అందించనున్నారు. మొత్తం నాలుగు రంగాలకు చెందిన వారికి ఈ పురస్కారాలు అందించనున్నట్లు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించారు.
పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, సాంస్కృతిక విభాగాల్లో గవర్నర్ ప్రతిభా పురస్కారాలు-2024 అవార్డులను అందిస్తారు. గత ఐదేళ్లుగా ఉత్తమసేవలు అందిస్తున్న వారికి గవర్నర్ ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేసినట్లు రాష్ట్ర గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. సంస్థలు, వ్యక్తులకు వేర్వేరు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రధానం చేస్తారని అన్నారు. ఈ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు, జ్ఞాపిక ఇస్తారు.
అవార్డుకు ఎంపికైన వ్యక్తులు, సంస్థలు ఇవే
దుశర్ల సత్యనారాయణ, అరికపూడి రఘు, పారా ఒలింపిక్ విజేత జీవాంజి దీప్తి, ప్రొఫెసర్ ఎం పాండురంగారావు – పిబి కృష్ణభారతికి సంయుక్తంగా అవార్డు ప్రధానం చేస్తారు. ఇక సంస్థల విషయానికొస్తే.. ధ్రువాంశు ఆర్గనైజేషన్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్.. నాలుగు సంస్థలు అవార్డుకు ఎంపికయ్యాయి.