2025-26 నుంచి 2027-28 వరకు బ్లాక్ పీరియడ్‌కు బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంబీఏ/ఎంసీఏ కోర్సుల ఫీజును పెంచుకునేందుకు చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) చేసిన అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. CBIT వసూలు చేసే ఫీజుల వివరాలు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేయాలని TG Eapcet అడ్మిషన్ల కన్వీనర్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ఆదేశించారు. బీటెక్ కోర్సులకు ఏడాదికి రూ.2,23,000గా, MTech కోర్సుకు రు.1,51,600, MBA/MCA కోర్సుకు రు.1,40,000లకు పెంచేందుకు కోర్టు CBITని అనుమతించింది. పెరిగిన ఫీజులు కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని కోర్టు స్పష్టం చేసింది..
సాధారణంగా రాష్ట్రంలో ప్రైవేట్, అన్‌ఎయిడెడ్ వృత్తివిద్య కళాశాలల్లో ఫీజులను మూడేళ్లకోసారి (బ్లాక్ పీరియడ్) సవరిస్తారు. టీఏఎఫ్‌ఆర్సీ ఆయా కాలేజీల ఆదాయ, వ్యయాల లెక్కలను పరిశీలించి కొత్త ఫీజులను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. గత బ్లాక్ పీరియడ్ (2022-25) ముగిసింది. దీంతో 2025-26 విద్యా సంవత్సరం నుంచి కొత్త ఫీజులు అమల్లోకి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి టీఏఎప్‌ఆర్సీ కాలేజీల నుంచి ప్రతిపాదనలు తీసుకుని, ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానీ పెరిగిన ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కాలేజీల ప్రతిపాదనలను పరిశీలించి, కొత్త ఫీజులను ఖరారు చేస్తామని చెబుతూ.. తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (TAFRC) సిఫార్సుల మేరకు ఈ ఏడాదికి మాత్రం పాత ఫీజులను కొనసాగించాలని ఉన్నత విద్యాశాఖ జూన్ 30న జీవో 26ను జారీచేసింది. అయితే ఫీజులు పెంచకుంటే ఆర్థికంగా ఇబ్బంది ఎదురవుతుందని, టీఏఎఫ్‌ఆర్సీ నిర్ణయించిన మేరకు ఫీజుల వసూలుకు అనుమతించాలని కోరుతూ.. ఉన్నత విద్యా శాఖ జూన్ 30న జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు (GO) 26ను సవాలు చేస్తూ CBIT దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు విచారించింది.
ఫీజు పెంపుదల కోరుతూ గురువారం లంచ్ మోషన్‌గా అనేక ఇంజనీరింగ్ కళాశాలలు దాఖలు చేసిన మరో బ్యాచ్ పిటిషన్లలో, కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం వరకు నిర్ణయం తీసుకోకుండా, కౌన్సెలింగ్ ప్రారంభమైన సమయానికి జిఓ జారీ చేయకుండా టిఎఎఫ్‌ఆర్‌సి, ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రకమైన జాప్యం ప్రతి యేటా కొనసాగుతోందని, అందుకే కళాశాలలు AFRC, ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళుతున్నట్లు జస్టిస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. అమెరికా, కెనడా, చిన్న దేశాలు కూడా ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఉచిత విద్యను క్రమబద్ధమైన ప్రణాళికతో ఎలా అందిస్తున్నాయో మనం తెలుసుకోవాలన్నారు. గడువు వచ్చే వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోని విధంగా మన వ్యవస్థ అభివృద్ధి చెందిందని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు గురునానక్, గోకరాజు రంగరాజుతోపాటు 11 ఇతర కళాశాలలు GO 26 ను సవాలు చేస్తూ గురువారం లంచ్ మోషన్ పిటిషన్లను దాఖలు చేశాయి.
ఈ కళాశాలలు డిసెంబర్ 2024 చివరి నాటికి తమ ప్రతిపాదనలను పంపినప్పటికీ, జూన్ 30 వరకు ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేదని జస్టిస్ లక్ష్మణ్ ప్రశ్నించారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలోని 15 మంది సభ్యుల AFRC ఇన్ని రోజులు ఏం చేస్తోందని న్యాయమూర్తి ప్రశ్నించారు. కళాశాల యాజమాన్యాలు మౌనం వహించడం, AFRC- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకునేలా క్రమం తప్పకుండా చర్యలు తీసుకోకపోవడాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. చివరి నిమిషం వరకు వేచి ఉండి, ఫీజు పెంపు కోసం కౌన్సెలింగ్ సమయంలో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేస్తూ హైకోర్టుకు వస్తున్నారు. ఫీజు పెంచాలా వద్దా అని తెలుసుకోవడం కోర్టు విధి కాదని న్యాయమూర్తి అన్నారు. కళాశాలల తరపున వాదించిన సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్, కళాశాలలు డిసెంబర్ 2024లో ప్రతిపాదనను పంపాయని, మార్చిలో ఫీజు కమిటీని ఏర్పాటు చేశాయని వాదించారు. కమిటీ ప్రతిపాదనలను అంగీకరించిందని కూడా ఆయన వాదించారు. కోర్టు ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం నాటికి AFRC ప్రతిపాదనలు, కమిటీ సమావేశ వివరాలను అందించింది.
రాష్ట్రం తరఫు ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వం పాత్ర AFRC ప్రతిపాదనలను ఆమోదించడమేనని అన్నారు. ఫీజును 70 నుంచి 80 శాతం పెంచడానికి కళాశాలలు ప్రతిపాదనలు పంపాయని, కొన్ని కళాశాలలు ప్రస్తుత ఫీజు కంటే రూ.1 లక్ష ఫీజు పెంచాలని కోరాయన్నారు. తద్వారా విద్యార్ధులపై భారం పడుతుందని ఆయన అన్నారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం శుక్రవారంకి విచారణను కోర్టు వాయిదా వేసింది.