మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని కొద్ది రోజుల క్రితం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జీహెచ్ఎంసీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చట్ట ప్రకారం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవికి చెందిన జూబ్లీహిల్స్ నివాసంలో జరుగుతున్న పునరుద్ధరణ పనులపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు.. ఆయన నివాస నిర్మాణాలకు సంబంధించి దాఖలైన దరఖాస్తుపై చట్టబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులను ఆదేశించింది.
చిరంజీవి తన ఇంటి పునరుద్ధరణలో భాగంగా నిర్మించిన రిటైన్ వాల్ క్రమబద్ధీకరణ కోసం 2025 జూన్ 5న జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేశారు. అయితే, దానిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానంలో చిరంజీవి తరఫు న్యాయవాది వాదిస్తూ.. 2002లోనే G+2 ఇంటి నిర్మాణానికి అనుమతులు పొందామని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పునరుద్ధరణ నిర్మాణాలు కూడా చట్టబద్ధమైన చర్యల అనుసరణలో భాగమేనని… వాటిని పరిశీలించి అధికారికంగా క్రమబద్ధీకరించాలని కోరినప్పటికీ GHMC స్పందించలేదని కోర్టుకు విన్నవించారు. దీనిపై జీహెచ్ఎంసీ తరఫు న్యాయవాది స్పందిస్తూ… చిరంజీవి దరఖాస్తుపై త్వరలో చట్టపరమైన ప్రక్రియ ప్రారంభిస్తామని హైకోర్టుకు తెలిపారు. అన్ని వాదనలు విన్న ధర్మాసనం… జీహెచ్ఎంసీ చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశిస్తూ పిటిషన్ విచారణను ముగించారు. ఈ తీర్పుతో చిరంజీవి ఇంటి నిర్మాణాలకు సంబంధించి క్రమబద్ధీకరణ ప్రక్రియను GHMC వేగవంతం చేసే అవకాశం ఉంది. తదుపరి నిర్ణయం చట్ట నిబంధనలకు అనుగుణంగా తీసుకోవాల్సి ఉంటుంది.
Amaravati News Navyandhra First Digital News Portal