స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా, ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో నల్గొండకు చెందిన సర్పంచ్‌ల పిటిషన్ దాఖలైంది. గత ఏడాది అంటే 2024 ఫిబ్రవరి 1వ తేదీతో సర్పంచ్‌ల పదవి కాలం ముగిసింది. కోర్టు ఆదేశాలతో రిజర్వేషన్లు, వార్డు డివిజన్ ప్రక్రియ మొదలు కానుంది. అయితే ప్రక్రియ పూర్తికి 25 రోజుల సమయం కావాలని ఇటీవల ప్రభుత్వం కోర్టుకు తెలుపగా, ఎన్నికల నిర్వహణకు 60 రోజుల సమయం కావాలని ఎన్నికల కమిషన్ కోరింది. ఈ వాదనలు విన్న హైకోర్టు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చింది.
రిజర్వేషన్ల అమలుపై కసరత్తు:
హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. బీసీలకు ఇచ్చిన హమీ మేరకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దన్న సుప్రీంకోర్టు నిబంధనతో మల్లగుల్లాలు మొదలయ్యాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లు చేయనున్నారు. 42 శాతం మంది బీసీలకు టికెట్లు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మీనాక్షితో పాటు అధిష్టానంతో పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. రెండు, మూడు రోజుల్లో రిజర్వేషన్లపై విధానం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.