గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాలకు లైన్‌క్లియర్‌.. ఆ ఏడు పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు

తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ ఫలితాల వెల్లడికి హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. రిజర్వేషన్ల అంశం తేలేవరకు మెయిన్స్‌ పరీక్షల ఫలితాలు ప్రకటించవద్దని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీజీఎస్‌పీఎస్సీ)ను ఆదేశించాలన్న విజ్ఞప్తిని సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇస్తే పిటిషన్ల దాఖలు ఆలస్యం కావడాన్ని తప్పుబట్టింది. ఇందుకు సంబంధించిన జీవో 29 అప్‌లోడ్‌ కాలేదన్న కారణాన్ని తోసిపుచ్చింది. ప్రిలిమ్స్‌ ఫలితాల వెల్లడి తర్వాత జీవోను సవాల్‌ చేయడం సరికాదని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో రిజర్వేషన్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్‌ సుజోయ్‌పాల్, జస్టిస్‌ జి రాధారాణితో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.

టీజీపీఎస్సీ గ్రూప్‌ 1 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022లో జీవో 55 జారీ చేసింది. ఆ తర్వాత పరీక్ష జరిగినా.. వరుస పేపర్‌ లీకేజీ కారణంగా ప్రిలిమ్స్‌ పరీక్ష 2 సార్లు రద్దైంది. ఆ తర్వాత కొత్తగా ఏర్పడిన రేవంత్‌ ప్రభుత్వం పోస్టుల సంఖ్య పెంచుతూ ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి నోటిఫికేషన్‌ ఇస్తూ జీవో 29 జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ ప్రకారం టీజీఎస్‌పీఎస్సీ అన్నింటా రిజర్వేషన్లు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ నల్లగొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన పోగుల రాంబాబు సహా పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మొత్తం ఏడు పిటిషన్లను హైకోర్టులో దాఖలయ్యాయి. గురువారం విచారణ చేపట్టిన ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్నారు.

ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మెయిన్స్‌కు ఎంపిక చేసిన 1:50లో కూడా సమాంతర రిజర్వేషన్లు పాటించేలా ఆదేశాలు జారీ చేయాలి. ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు. 1:50 మేరకు రిజర్వేషన్లు పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉండగా, అంతకు మించి మెయిన్స్‌కు ఎంపిక చేశారు. రీ నోటిఫికేషన్‌ ఇస్తూ జారీ చేసిన జీవో 29 కూడా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. రిజర్వేషన్ల అంశం తేలేదాకా మెయిన్స్‌ ఫలితాలు వెల్లడించకుండా టీజీఎస్‌పీఎస్సీని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దయ్యాయని, రేవంత్‌ సర్కార్‌ మాత్రం ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రిలిమ్స్, మెయిన్స్‌ నిర్వహించామన్నారు. పిటిషన్లను అనుమతించవద్దని, మెయిన్స్‌ ఫలితాల వెల్లడిని అడ్డుకోవద్దని కోరారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వెల్లడిస్తూ..

2024లో పోస్టుల సంఖ్యను 503 నుంచి 563కు పెంచుతూ ఇచ్చిన జీవో 29 ప్రకారం రిజర్వుడు కేటగిరీతో సంబంధం లేకుండా పోస్టుల సంఖ్య మేరకు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయాలని, 1:50 మేరకు రిజర్వుడ్‌ అభ్యర్థుల సంఖ్య ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులంతా ఓపెన్‌ కేటగిరీ పోస్టులకు పోటీ పడవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది.

About Kadam

Check Also

రతన్ టాటా రూ.15 వేల కోట్లు ఎవరికి వస్తాయి? వీలునామాలో ఎవరి పేర్లు ఉన్నాయి?

రతన్‌టాటా ప్రస్తుతం మన మధ్య లేరు. గొప్ప వ్యాపారవేత్త.. అంతకుమించిన మహా మనిషి. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి. దిగ్గజ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *