Telangana KNRUHS NEET UG 2025 counselling: రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం (KNRUHS) మంగళవారం (జులై 15) నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు..
తెలంగాణ రాష్ట్రంలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం (KNRUHS) మంగళవారం (జులై 15) నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్వీనర్ కోటా కింద ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. నీట్ యూజీ 2025లో అర్హత సాధించిన విద్యార్ధులు జులై 16వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జులై 25 సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్లు, ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులు రూ.4,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు రూ.3,200 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు ప్రైవేట్, మైనారిటీ, నాన్ మైనారిటీ మెడికల్, డెంటల్ కాలేజీలలోని కాంపిటెంట్ అథారిటీ కోటా కింద ఉన్న సీట్లకు ఈ నోటిఫికేషన్ కింద ప్రవేశాలు కల్పిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ కాలేజీల్లో 85 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లను భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి వివిధ కేటగిరీల కింద నిర్దేశించిన కటాఫ్ మార్కులను కూడా కాళోజీ యూనివర్సిటీ వెల్లడించింది. ఓసీ, ఈడబ్లు్యఎస్ కేటగిరీ విద్యార్థులకు 144 మార్కులు (50 శాతం పైగా పర్సంటైల్), బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 113 మార్కులు (40 శాతం పైగా), దివ్యాంగులకు 127 (45 శాతం పైగా) మార్కులు కటాఫ్‌గా నిర్ణయించింది.
పీఐఓ/ఓసీఐ కార్డు కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో కనీసం 4 సంవత్సరాలు చదువుకున్న లేదా నివసించినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఇంటర్ లేదా సమానమైన అర్హత సబ్జెక్టులు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/బోటనీ/జువాలజీ లేదా బయోటెక్నాలజీ, ఇంగ్లిష్ చదివి ఉండాలి. 2025 డిసెంబర్ 31 నాటికి అభ్యర్ధుల కనీస వయస్సు 17 ఏళ్లు ఉండాలి. రిజిస్ట్రేషన్ సమయంలో నీట్ ర్యాంక్ కార్డుతోపాటు, బర్త్ సర్టిఫికెట్, ఇంటర్ మార్కుల మెమో, 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, ఫొటో, సంతకం వంటి పత్రాలు తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్‌లో ఒరిజినల్ సర్టీఫికేట్లు పరిశీలించిన తర్వాతే ప్రవేశం ఖరారు అవుతుంది. వెబ్ ఆప్షన్ల తేదీలు త్వరలోనే విడుదలకానున్నాయి.