తెలంగాణలో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఛాన్స్‌

మంత్రివర్గ విస్తరణ తరువాత సీఎం రేవంత్ రెడ్డి పాలనా పరంగా కీలక నిర్ణయాలకు సిద్ధమయ్యారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌లో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేసీఆర్, కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్న వేళ.. రాజకీయంగా తన పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్నారు. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేపు తెలంగాణ మంత్రులతో సీఎం సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రావడానికి 15 రోజులు మాత్రమే గడువు ఉందన్నారు. మీ గ్రామాల్లో లోటుపాట్లు ఉంటే.. సరిదిద్దుకుని ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పారు. వారంలోగా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా, బోనస్ ఇస్తామన్నారు పొంగులేటి.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇదే సరైన సమయంగా సీఎం రేవంత్ భావిస్తున్నారు. ఇటీవల ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. కుల గణన తరువాత క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌కు ఆశాజనకంగా పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో వ్యూహాత్మకంగానే సామాజిక సమీకరణాలు అమలు చేసారు. ఇప్పుడు బీఆర్ఎస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. అటు కేసీఆర్.. ఇటు కేటీఆర్ వరుసగా విచారణలు ఎదుర్కొంటున్న వేళ ఎన్నికల నిర్వహణ విషయంలో పైచేయి సాధించవచ్చనే అంచనాలతో కాంగ్రెస్‌ ఉన్నట్లు తెలుస్తోంది. జెడ్పీటీసీ.. ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ తరువాత గ్రామ పంచాయతీ.. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ కనిపిస్తోంది.

అదే సమయంలో రిజర్వేషన్ల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉండనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇటీవల నాలుగు పథకాలను అమలు చేయటం ప్రారంభించటం, సన్నబియ్యం పంపిణీతో ప్రస్తుతం గ్రామీణ వాతావరణం రాజకీయంగా తమకు అనుకూలంగా ఉందనే అంచనాల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దీంతో, ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన గ్రామీణ ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ సత్తా చాటాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దీంతో, ఇప్పుడు ఎన్నికల సమరం తెలంగాణలో మరోసారి రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *