సైబర్ క్రైమ్.. ఇప్పుడు ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే. టెక్నాలజీ పెరుగుతున్నట్లుగానే సైబర్ కేటుగాళ్లు సైతం అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు..తెలంగాణ పోలీసులు. దీంతో కలుగులో దాక్కున్న సైబర్ కేటుగాళ్లు..పట్టుబడుతున్నారు.
సైబర్ కేటుగాళ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.. తెలంగాణ పోలీసులు. ఆన్‌లైన్ ఫ్రాడ్స్‌పై ఓవైపు ప్రజల్లో అవగాహన కల్పిస్తూనే..మరోవైపు నేరాలకు పాల్పడుతున్నవారిని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు..గత రెండు నెలల వ్యవధిలో 161 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ట్రేడింగ్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న 82 మందిని గుర్తించారు పోలీసులు. సుమారు 11 రాష్ట్రాల్లో గాలించి.. ఈ సైబర్ కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వంద మొబైల్ ఫోన్లు, సిమ్‌కార్డ్స్, ల్యాప్‌ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నారు.
డిజిటల్ పేమెంట్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా కేటుగాళ్లు మన బ్యాంక్ ఖాతాలకు కన్నం వేస్తున్నారు. గత ఏడాది సైబర్ నేరగాళ్లు దేశవ్యాప్తంగా 22 వేల 812 కోట్ల రూపాయలు దోచుకున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రతిష్టాత్మక సంస్థలతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అధికారులు చెబుతున్నారు. 2024లో సైబర్ నేరగాళ్లు కాజేసిన 350 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేసి 183 కోట్ల రూపాయలు 18 వేల మంది బాధితులకు తిరిగి అందించారు సైబర్ క్రైమ్ పోలీసులు. మరోవైపు హైదరాబాద్‌లో ఇటీవల రెండు రోజుల పాటు నిర్వహించిన షీల్డ్ కాంక్లేవ్ సైబర్ క్రైమ్‌కు చెక్ పెట్టేందుకు కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది.
మరోవైపు అప్రమత్తతతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని పోలీసులు చెబుతున్నారు. నేరం జరిగిన మొదటి గంటలోనే ఫిర్యాదు చేయడం వల్ల స్కామర్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసి పోయిన డబ్బు సులభంగా రికవరీ చేయవచ్చని అంటున్నారు. సైబర్ నేరగాళ్ళ బారిన పడి మోసపోతే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచిస్తున్నారు.