తెలంగాణ రాష్ట్ర పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2025 జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఫలితాల కోసం విధ్యార్ధులు కళ్లు కాయలుకాసేలా విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పదో తరగతి, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడించగా.. తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి.
పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదలకానున్నట్లు తెలుస్తుంది. తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (బీఎస్‌ఈ) పదో తరగతి సప్లిమెంటరీ 2025 ఫలితాల విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే జూన్ మూడో వారం లేదంటే జూన్ చివరి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారుల నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా 42,832 మంది విద్యార్థులు పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది తెలంగాణ ఎస్‌ఎస్‌సీ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తయిన రెండు వారాల తర్వాత అంటే జూన్ 28న ఫలితాలు ప్రకటించారు. ఈసారి మాత్రం ఫలతాల విడుదలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో విద్యార్ధుల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు ఫలితాలు విడుదలైన వెంటనే ఇంటర్మీడియట్‌తోపాటు పాలిటెక్నిక్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి త్వరితగతిన ఫలితాలను విడుదల చేయాలని అధికారులు సైతం భావిస్తున్నట్లు సమాచారం.