గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించనుంది తెలంగాణ సర్కార్. అది కూడా చౌక ధరకే. టీ-ఫైబర్ ఆధ్వర్యంలో దశలవారీగా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఇంటర్నెట్ అందించనున్నారు.
ఇకపై తెలంగాణలో అత్యంత చౌకగా ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. టి ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్‌ను ప్రభుత్వం 300 రూపాయలకే ఇవ్వనుంది. ఈ కనెక్షన్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న టీవీని కంప్యూటర్ మాదిరిగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా టీవీలోనే ప్రత్యేక వెసులబాటును కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 20 ఎంబిబిఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ కనెక్షన్ అందివ్వనుంది ప్రభుత్వం. ఇందులో పలు తెలుగు ఓటీటీలు కూడా అందుబాటులో ఉంటాయి.
మొదటి దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 2096 కి పైగా గ్రామపంచాయతీలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటితోపాటు 30 వేలకు పైగా ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టీ ఫైబర్ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. తొలి దశలో తెలంగాణలోని పలు జిల్లాలలో టీ ఫైబర్ ట్రయల్ సేవలను ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి మీదగా టీ ఫైబర్ ట్రైల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకునే విధంగా ఈ తరహా పథకానికి శ్రీకారం చుట్టారు. సాధారణ స్పీడ్ తో పాటు హై స్పీడ్ సేవలను సైతం గ్రామీణ స్థాయి ప్రజలకి ప్రభుత్వం అందించనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం టి ఫైబర్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు అత్యంత తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తొలి దశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాలోని పలు గ్రామాలకు ఈ ట్రయల్ సేవలను అందించనున్నారు…ఈ నెల 8 న సీఎం రేవంత్ రెడ్డి ఈ సేవల్ని ప్రారంభించనున్నారు. తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా 94 మండలాలు, 2,096 గ్రామ పంచాయతీల్లో కమర్షియల్ సేవలు అందించేందుకు అధికారులు మ్యాప్ రెడీ చేశారు.