ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో తెలుగు సినీ పరిశ్రమ పెద్దటు, నిర్మాతలు, నటులు భేటీ కానున్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు వారు సీఎం చంద్రబాబును కలవనున్నారు. తొలుత డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌తో భేటీ అయిన ఆ తర్వాత సీఎం చంద్రబాబును కలవనున్నారు సినీ పెద్దలు. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇంత వరకు సినీ ప్రముఖులు సీఎంను కలిసింది లేదు. కేవలం డిప్యూటీ సీఎం పవన్‌ను మాత్రమే కలిశారు. అయితే, ఇటీవల థియేటర్ల బంద్‌కు సంబంధించిన విషయంపై స్పందించిన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సినీ ప్రముఖులు ఒక్కసారైన సీఎంను కలిశారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని థియేటర్‌ల పరిస్థితిపై సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని సినిమాటోగ్రఫీ శాఖ ఆదేశాలు జారీ చేశారు.
డిప్యూటీ సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు పలు థియేటర్‌లలో తనిఖీలు నిర్వహించారు. కాగా ఇప్పుడు ఇదే విషయంపై సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లను సినీ ప్రముఖులు కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం సీఎం చంద్రబాబును కలిసేందుకు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. మొదటగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన తర్వాత.. ఆయనతో కలిసి సినీ ప్రముఖలు సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. అక్కడ ఏపీలో సినీ ఇండస్ట్రీ పరిస్థితులపై సీఎం సినీ పెద్దలు చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా సమావేశం కానుట్టు తెలుస్తోంది.
సీఎంతో జరిగే సమావేశానికి హాజరుకానున్న సినీ ప్రముఖులు వీరే…
అయితే సీఎం చంద్రబాబుతో కలిసేందుకు తెలుగు సినీ పరిశ్రమ నుంచి సుమారు 35 నుంచి 40 మంది వరకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. వారిలో దర్శకులు బోయపాటి శ్రీనివాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి, నాగ అశ్విన్ ఉండగా, నిర్మాతలు అశ్వినీదత్, దిల్ రాజు, అల్లు అరవింద్, దానయ్య, కెవి రామారావు ఉన్నారు. వీరితో పాటు నటులు బాలకృష్ణ దగ్గుబాటి వెంకటేశ్, మంచు మనోజ్, సుమన్, ఆర్.నారాయణమూర్తి, నాని ఉన్నారు.