గణేష్ నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ట్యాంక్ బండ్ వద్ద జరిగే వినాయక నిమజ్జనాలను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి భక్తులు తరవచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నగరంలో ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిమజ్జనాలు పూర్తయ్యే వరకు నగరంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించింది.
హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జన వేడుకలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం నగరంలోని హుస్సేన్ సాగర్, ట్యాంక్ బండ్ వద్ద జరిగే వినాయక నిమజ్జనాన్ని చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా జనాలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి సందర్భంగా నగరంలో ప్రత్యేక బస్సులు నడుతున్నట్టు తెలిపింది. భక్తులు ప్రైవేటు వాహనాలలో రాకుండా పబ్లిక్ రావాణా సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా అధికారులకు సహకరించాలని కోరింది.
చార్మినార్ డివిజినల్ పరిధిలోని బర్కత్‌పురా, ముషీరాబాద్, ఫలక్‌నూమా, కాచిగూడ, మెహిదీపట్నం, రాజేంద్రనగర్ డిపోలు, హయత్‌నగర్ పరిధిలోని దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్-1,2, మిథాని డిపోల నుంచి నిమజ్జనం కోసం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరోవైపు కాచిగూడ, రాంనగర్ నుంచి బషీర్‌బాగ్ వరకు, కొత్తపేట, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, మిథాని నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. అలాగే జామై ఉస్మానియా నుంచి ఇందిరా పార్క్, గచ్చిబౌలి, లింగంపల్లి, రాజేంద్రనగర్ నుంచి లక్డీకాపూల్, పటాన్‌చెరు నుంచి లింగంపల్లి, ఆఫ్జల్‌గంజ్ నుంచి ఆలిండియా రేడియో వరకు బస్సుల రాకపోకలు కొనసాగించనున్నాయి.