ఏపీలో అధికారంలోకి వచ్చిన ఇటీవలే ఏడాది పాలనను పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం పాలనలో తమదైన మార్క్‌ను చూపుతోంది. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకువెళ్తోంది. ఈ క్రమంలో తాజాగా సూపర్ సిక్స్ పథకాల్లొ ఒకటైన తల్లివందనం పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి 15వేల రూపాయలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇప్పటికే విద్యార్థుల తల్లుల ఖాతాలోకి నగదు జమ చేసింది. అయితే ఇది ఒకరిద్దరు ఉన్న విద్యార్ధుల తల్లిదండ్రులకు ఊరట కలిగించే అంశమే అయినా, కుటుంబంలో ఎంతమంది విద్యార్ధులు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం కింద సాయం చేస్తామని ఎన్నికలకు ముందు టిడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకాశంజిల్లా మార్కాపురంలో పూర్తిస్థాయిలో నెరవేరినట్టయింది.
వివరాళ్లోకి వెళితే.. ప్రకాశంజిల్లా మార్కాపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. విద్యార్థులు అంకాలు, వీరాంజనేయులు, శివ కేశవ, వెంకటస్వామి, సాయి పల్లవికి తల్లికి వందనం పథకం కింద మొత్తం రూ. 75 వేలు వారి తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో ఆ కుటుంబ ఆనందానికి అంతులేకుండా పోయింది. 18 వ వార్డులో నివాసం ఉంటున్న ఆవుల శ్రీను, అల్లూరమ్మ దంపతుల కుటుంబానికి తల్లికి వందనం పథకం కింద నగదు జమ అయిన విషయాన్ని తెలుసుకున్న స్థానిక టిడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. లబ్ధిదారుల నివాసానికి వెళ్లి వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. అలాగే ప్రభుత్వ పాలనపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు.