అర్ధరాత్రి చోరీకి వచ్చి.. గుర్రుపెట్టి నిద్రపోయిన దొంగ దొర! ఆ తర్వాత ఏం జరిగిందంటే

 ఓ దొంగ గారు అర్ధరాత్రి ఊరంతా సద్దుమనిగాక పిల్లిలా దొంగతనానికి వచ్చాడు. చప్పుడు చేయకుండా ఓ ఇంట్లో చొరబడ్డాడు. ఇంట్లో దూరిన దొంగ చకచకా వచ్చిన పని కానిచ్చి జారుకోవాలనే విషయం మర్చిపోయాడు. అంతే.. అసలే అర్ధరాత్రి, ఆపై నిద్ర ముంచుకు రావడంతో చక్కగా ఫ్యాన్‌ కింద పడుకుని గురకలు పెట్టి మరీ నిద్రపోయాడు. ఇంతలో బయటకు వెళ్లిన ఇంటి యజమాని ఇంటి తలుపులు తీసి ఉండటం చూసి అవాక్కయ్యాడు. ఇంట్లోకి తొంగి చూడటంతో లోపల గుర్తుతెలియని అగంతకుడు హాయిగా నిద్రపోవడం చూసి వెంటనే పోలీసుకు సమాచారం అందించాడు. ఈ విచిత్ర ఘటన హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ ప్రాంతంలో మేడిపల్లి ఠాణా పరిధిలో బుధవారం (జులై 16) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

హైదరాబాద్‌లోని బోడుప్పల్‌ శ్రీసాయిరాం నగర్‌ ప్రాంతంలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వి శంకర్‌ కుటుంబం నివాసం ఉంటుంది. వీరు బుధవారం (జులై 16) విజయవాడ వెళ్లారు. పని ముగించుకుని అదే రోజు అర్ధరాత్రి తిరిగి ఇంటికి వచ్చారు. అయితే తమ ఇంటి తాళం పగులగొట్టి ఉండటం చూసి షాకయ్యాడు. వెంటనే తలుపులు తీసి లోపలికి తొంగి చూశాడు. ఇంట్లో ఓ గుర్తుతెలియని వ్యక్తి నిద్రపోతూ కనిపించాడు. వెంటనే భయాందోళనకు గురైన శంకర్‌ ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సదరు దొంగ గారిని తట్టి లేపేంత వరకూ ఈ లోకంలో లేడు. ఎవరో తట్టినట్లు ఉండటంతో కళ్లు తెరచిన దొంగ అసలు తానెందుకు ఆ ఇంట్లోకి వచ్చాడన్న సంగతి గుర్తుకొచ్చి నాలుక కరచుకున్నాడు. మాయదారి నిద్ర రాకుండా ఉంటే చక్కగా చేతికందినంత దోచుకుని పారిపోయేవాడు. కానీ అప్పటికే జరగవల్సిన పొరబాటు జరిగిపోయింది. సదరు వ్యక్తి చోరీకి వచ్చాడని గుర్తించిన పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని, తీసుకెళ్లి జైల్లో వేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

About Kadam

Check Also

సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌.. సెప్టెంబర్‌లోనే స్థానిక సంస్థల ఎన్నికలు

తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *