ఏపీ, తెలంగాణలో ఓ వైపు పొలిటికల్ మెరుపులు పెరిగిపోతుంటే.. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైందో చూద్దాం.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
అన్నదాతలకు గుడ్ న్యూస్ చెప్పింది వాతావరణశాఖ. వర్షాకాలం వచ్చిందన్నమాటే కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకూ సరైన వర్షాలు పడలేదు. దీంతో నారుపోసి, నాట్లు వేసిన అన్నదాతలు పంటలు ఎండిపోతుండటంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వానజాడకోసం ఆకాశంవైపు చూస్తూ వరుణుడిని వేడుకుంటున్నారు. ఈ క్రమంలో వాతావరణ అధికారులు రైతన్నలకు చల్లని కబురు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మూడు రోజులు పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సోమవారం అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. మంగళవారం పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
బుధవారం పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు.
Amaravati News Navyandhra First Digital News Portal