శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహ్మోత్సవాల డేట్ వచ్చేసింది.. బ్రేక్ దర్శనాల సహా పలు దర్శనాలు రద్దు.. గరుడ వాహన సేవ ఎప్పుడంటే..

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ అప్పుడే సమాయత్తం అవుతోంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రణాళికలు రూపొందిస్తోంది. నిర్దేశిత సమయంలోపే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించింది.

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈ మేరకు టీటీడీ అదనపు ఈవో సిహెచ్‌ వెంకయ్య చౌదరి టీటీడీ ఉన్నతాధికారుల తో జరిపిన సమీక్ష దిశా నిర్దేశం చేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అదనపు ఈవో చేపట్టబోయే ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ మేరకు పలు సూచనలు చేశారు.

ఇవే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ముఖ్య అంశాలు…

సెప్టెంబర్ 16న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. మర్నాడు అంటే సెప్టెంబర్ 24న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం చేనున్నారు. కాగా ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక గట్టమైన గరుడ వాహన సేవ సెప్టెంబర్ 28వ తేదీన జరగనుంది. అక్టోబర్ 1న రథోత్సవం, 2 న జరిగే చక్రస్నానం తో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు స్వామివారి వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ, దాతల దర్శనాలు కూడా రద్దు చేసింది.

విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్న టీటీడీ రోడ్ మ్యాప్ లు, పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. భక్తులకు దర్శన క్యూలైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అదనపు ఈఓ అధికారులను ఆదేశించారు. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు.

గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని తీసుకోవాలన్నారుభక్తులను ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి సేవకులుగా యువతీ, యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 27న రాత్రి 9 నుండి 29 వరకు ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరించింది. భక్తుల రద్దీకి తగ్గట్టుగా లడ్డూల నిల్వ ఉంచుకోవాలని ఆదేశించారు.

About Kadam

Check Also

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *