తిరుపతి విమానాశ్రయానికి పేరు మార్పు..? కేంద్రానికి టీటీడీ సిఫార్సు..

తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్రయం పేరు మారబోతుందా? అంటే నిజమనిపిస్తుంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పేరు సిఫార్సు చేస్తూ.. కేంద్రానికి లేఖ పంపింది. ఇక నుంచి రేణిగుంటను శ్రీ వేంక‌టేశ్వర అంత‌ర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడంపై టీటీడీ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు టీటీడీ బోర్డు చర్చించి తీర్మానం చేసింది. కేంద్ర పై ఒత్తిడికి ప్రయత్నిస్తోంది.

తిరుమ‌ల‌కు ఐకానిక్‌గా విమానాశ్రయానికి ఆధ్యాత్మిక శోభ‌ను తీసుకొచ్చేందుకు కేంద్ర విమాన‌యాన శాఖ‌కు టీటీడీ సిఫార్సు చేసింది. తిరుమల అన్నమయ్య భవన్‌లో మంగళవారం(జూన్ 17) జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చైర్మన్ బీ.ఆర్.నాయుడు తన క్యాంపు కార్యాల‌యం లో మీడియా సమావేశం నిర్వహించి వివరించారు.

క‌ర్ణాట‌క సీఎం, డిప్యూటీ సీఎంల‌ అభ్యర్థన మేర‌కు బెంగుళూరులోని ముఖ్యమైన ప్రాంతంలో శ్రీ‌వారి ఆల‌యం నిర్మించాల‌ని నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. ఇందుకు కావాల్సిన 47 ఎక‌రాల స్థలాన్ని క‌ర్ణాట‌క ప్రభుత్వం కేటాయించ‌గానే ఆల‌య నిర్మాణం చేపట్టేందుకు చ‌ర్యలు తీసుకుంటామన్నారు. అలాగే, కేంద్ర భారీ ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి హెచ్‌.డీ.కుమార స్వామి కేంద్ర ప్రభుత్వం నుండి టీటీడీకి 100 ఎల‌క్ట్రిక్ బ‌స్సులు కేటాయించేందుకు ముందుకు వచ్చారన్నారు. త్వర‌లోనే ఎలక్ట్రిక్ బ‌స్సులను తిరుమ‌ల‌ తెచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.

ఇక కేంద్ర ప్రభుత్వం తిరుప‌తిలో ఏర్పాటు చేయ‌నున్న సీఎస్ఐఆర్ ల్యాబ్‌కు లీజు ప‌ద్ధతిలో టీటీడీ స్థలాన్ని కేటాయించాల‌ని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. త‌ద్వారా టీటీడీ వినియోగించే నెయ్యి, నీరు, ఆహార ప‌దార్థాల నాణ్యత‌ను ఉచితంగా త‌నిఖీ చేసేందుకు అవ‌కాశం ఉంటుందని బీఆర్ నాయుడు వెల్లడించారు.

న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక టీటీడీ క‌ళాశాల‌ను ఆధునీక‌రించాల‌ని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ చెప్పారు. టీటీడీ పరిధిలోని కాలేజీ లెక్చర‌ర్ పోస్టుల భ‌ర్తీని నిలిపి వేయాల‌ని ఏపీపీఎస్సీకి సిఫార్సు చేశామన్నారు. ఇప్పటికే ప‌ని చేస్తున్న 200 మంది కాంట్రాక్ట్ లెక్చర‌ర్ల స‌మ‌స్యలను ప‌రిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారన్నారు. ఈ మేర‌కు త్రిస‌భ్య క‌మిటీ ఏర్పాటు చేశామన్నారు.

సమరసతా సేవా ఫౌండేషన్ సహకారంతో ప్రస్తుతం నిర్వహిస్తున్న అర్చకుల శిక్షణా కార్యక్రమంతో పాటు వివిధ వ్రతాలు, పూజా విధానాలలో కూడా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. విద్యార్థుల్లో హైందవ సనాతన ధర్మం నేర్పించి, మానవీయ విలువలను, వ్యక్తిత్వ వికాస కార్యక్రమాల్లో శిక్షణ ఇవ్వడానికి సద్గమయ కార్యక్రమాన్ని టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లోని దాదాపు 1,600 మంది విద్యార్థులకు డే స్కాలర్ విధానంలో శిక్షణ ఇస్తామన్నారు.

టీటీడీ విద్యా సంస్థల్లోని విద్యార్థులకు హిందూ సనాతన ధార్మిక విలువలతో పాటు తెలుగు సాంస్కృతిక వైభవంలో శిక్షణ ఇవ్వడంలో భాగంగా మన వారసత్వం అనే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ బీ.ఆర్. నాయుడు తెలిపారు. వరలక్ష్మీ వ్రతం పర్వదినాన తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో సౌభాగ్యం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నా మన్నారు.

అదేవిధంగా అక్షర గోవిందం, హరికథా వైభవం, భగవద్గీత అనుష్టాన బోధన, భజే శ్రీనివాసం, వన-నిధి, గిరి జనార్దనం, సన్మార్గం వంటి కార్యక్రమాలను నిర్వహించి జన బాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చర్యలు చెందుతున్నట్లు చెప్పారు. జూన్ 21వ తేదీన యోగ దినోత్సవం సందర్భంగా టీటీడీ పరిపాలన భవనం గ్రౌండ్‌లో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *