తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనపై సిట్ విచారణ షురూ చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో విచారణలో దూకుడు పెంచారు సిట్ అధికారులు. శ్రీవారి ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. లడ్డు బూందీ పోటులో సోదాలు చేశారు. లడ్డూ బూందీకి వినియోగించే నెయ్యిని పరిశీలించారు. గత జగన్ ప్రభుత్వంలో వాడిన నెయ్యిపై ఆరా తీశారు. వినియోగించే నెయ్యి నాణ్యత గురించి విచారణ బృందం అడిగి తెలుసుకుంది. రోజూ ఎంత నెయ్యి వినియోగిస్తారు? ఎక్కడ నుంచి తీసుకొస్తారంటూ? అక్కడి అధికారుల నుంచి సమచారం రాబడుతోంది. ఈ నేపథ్యంలోనే పిండి మరను పరిశీలించారు. అదేవిధంగా ఆహార ఉత్పత్తుల నిల్వ ప్రదేశం, పరిశోధనశాలను సిట్ బృందం తనిఖీ చేసింది. పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వారం రోజులుగా తిరుపతిలో విచారణ జరిపిన అధికారులు ప్రజెంట్ తిరుమలలో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు. పూర్తి నివేదిక రెడీ చేసిన సిట్ అధికారులు.. నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు.
మరోవైపు ఇప్పటికే ఏఆర్ డెయిరీతో పాటు వైష్ణవి డెయిరీలను సిట్ అధికారులు పరిశీలించారు. సిట్‌లోని 2 బృందాలు తిరుపతిలోని కార్యాలయంలో వీటిని నిశితంగా పరిశీలించాయి. టీటీడీకి నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థనే నేరుగా సరఫరా చేసిందా? లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చి ఇచ్చిందా? అనేది పరిశీలన చేస్తోంది. టెండర్ సమయంలో టీటీడీ పేర్కొన్న నిబంధనలు ఏమిటి? ఆయా సంస్థల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాలను సరిపోల్చుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే సీబీఐ అధికారుల బృందం కూడా తిరుమలలో విచారణ చేపట్టనుంది. మార్కెటింగ్ గోదాములు, లడ్డూ బూందీ పోటులోనూ సోదాలు చేయనున్నారు.