రథసప్తమి వస్తోంది…! భక్తుల తాకిడి గట్టిగానే ఉంటుంది…! మరేం చేద్దాం…? ఎలా ముందుకెళ్దాం…? ఇదే విషయమై సమావేశమైన టీటీడీ పాలక మండలి… కీలక నిర్ణయాలు తీసుకుంది. మాడ వీధుల్లో జరుగుతున్న ఏర్పాట్లను ఛైర్మన్ పరిశీలించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. ఆ డీటేల్స్ ఇప్పుడు తెలుసుకుందాం….
తిరుమలలో ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన టీటీడీ పాలకమండలి…పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి 4న జరగబోయే రథసప్తమిపై కీలకంగా చర్చించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకొని… రథసప్తమి నాడు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈసారి రథసప్తమికి 3 లక్షల మంది వస్తారన్న అంచనాతో… మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఛైర్మన్ బీఆర్ నాయుడు అధికారులకు సూచించారు. అలాగే ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ఫిబ్రవరి 4న శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు, సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక రథసప్తమికి 8 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నామన్నారు బీఆర్ నాయుడు.
ఇటు శ్రీవారి రథసప్తమిలో వినియోగించే సర్వభూపాల వాహనం పటిష్టతను పరిశీలించేందుకు నిర్వహించిన ట్రయల్ రన్‌పైనా సమావేశంలో చర్చించారు. వాహన సేవల సమయంలో వాహనబేరర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి టీటీడీ ఛైర్మన్ సూచించారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు అప్రతమత్తంగా వ్యవహరించాలన్నారు.
తిరుమల నాలుగు మాడ వీధుల్లో టీటీడీ ఛైర్మన్ పరిశీలన
ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా తిరుమల మాడ వీధుల్లో భక్తుల సౌకర్యార్థం వేసిన చలువ పందిళ్లను, గ్యాలరీల్లోకి భక్తుల ప్రవేశం, నిష్క్రమణ, అత్యవసర గేట్లను, భక్తులు నడిచే సమయంలో వేడి లేకుండా వైట్ పెయింట్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. గ్యాలరీలలోని భక్తులకు ఎప్పటికప్పుడు పబ్లిక్ అడ్రెస్ సిస్టమ్ ద్వారా సమాచారం చేరవేసేలా ప్రకటనలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. భక్తులు గ్యాలరీలోకి ప్రవేశించాక వారికి కావాల్సిన అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర సౌకర్యాలను క్రమం తప్పకుండా అందించాలని కోరారు. గత అనుభవాల దృష్ట్యా భక్తులు సౌకర్యవంతంగా శ్రీవారి వాహన సేవలను వీక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.