ఆపదమొక్కుల స్వామికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి తిరుమల కొండకు చేరతారు. మొక్కులు చెల్లించేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతారు. ముడుపులు కట్టి కొండ మెట్లు ఎక్కి కోనేటి రాయుడు దర్శనం కోసం తిరుమల కొండకు చేరి భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లిస్తారు. అయితే భక్తులను ప్రవేయిట్ వాహనదారులు అధిక చార్జీల పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఈ దందాకు చెక్ పెట్టేందుకు టీటీడీ ప్లాన్ చేసింది.
ఏడుకొండల మీద కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కొందరు మెట్ట మార్గంలో ,మరికొందరు ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో తిరుమల చేరుకుంటారు. వడ్డికాసుల వాడికి మొక్కులు చెల్లించే భక్తులు కొందరు నిలువు దోపిడీ సమర్పిస్తారు. ఇలా ఎంతో భక్తి భావంతో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు టీటీడీ ఎన్నో చర్యలు తీసుకుంటుంది. భక్తులకు స్వామి వారి సంతృప్తికర దర్శనం కలగాలని ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగానే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన టీటీడీ పాలనలో ప్రక్షాళన తీసుకొస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు చేరే భక్తులు తిరుమల లో పలు ప్రాంతాల్లో తిరగాలంటే రవాణా సౌకర్యంలో ఇబ్బంది కాకూడదని భావించిన టీటీడీ మరో కొత్త ప్రయత్నం చేస్తుంది.
నిత్యం ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 40 వేల మంది భక్తులు కొండపైకి వస్తుండగా వీరికి తిరుమలలో ఉచిత రవాణా అందుబాటులో ఉండాలని టీటీడీ భావిస్తోంది. తిరుమలకు వచ్చే యాత్రికులు వసతి గృహాలు, అన్నదానం, కళ్యాణకట్ట లేదంటే ఇతర ప్రాంతాలకు చేరుకోవాలంటే ప్రైవేట్ టాక్సీలపై ఆధార పడక తప్పని పరిస్థితి ఉండడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. సొంత వాహనాల్లో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా సామాన్య భక్తులు మాత్రం ప్రైవేట్ టాక్సీ ల దందాకు గురికావాల్సి వస్తోందని గుర్తించిన టీటీడీ ఈ మేరకు చర్యలు చేపట్టింది. ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు అడిగినంత సమర్పించు కోవాల్సిన పరిస్థితి భక్తులకు ఏర్పడుతోందని గుర్తించిన టీటీడీ ఈ దందాకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది.
తిరుమలలో పలు ప్రాంతాల్లో భక్తులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ట్రయల్ రన్ నిర్వహిస్తోంది. ఇప్పటికే తిరుమలలో భక్తులకు ఉచితంగా ప్రయాణించేందుకు 14 బస్సులను టీటీడీ రవాణా విభాగం నడుపుతోంది. రానున్న రోజుల్లో తిరుమలలో పలు ప్రాంతాలకు వెళ్లాలనుకునే యాత్రికులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించేలా ఆర్టీసీ తో చర్చలు జరుపుతోంది. ఈ మేరకు కసరత్తు చేస్తున్న టీటీడీ ఉచితం బసు రూట్ లో ఆర్టీసీ ఏసీ బస్సులను ట్రయిల్ రన్ నడుపుతోంది.
అలిపిరి డిపోలో అందుబాటులో ఉన్న 64 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తిరుమలలో ఫ్రీ బస్ రూట్లలో నడపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే రెండు రోజులుగా ట్రయిల్ రన్ నిర్వహిస్తూ ఆర్టీసీ.. యాత్రికుల లోటుపాట్లను గుర్తిస్తోంది. జీఎన్సీ నుంచి పద్మావతి ఎంక్వయిరీ, ఎస్ఎన్సీ, ఏటీసీ సర్కిల్, ఎంబీసీ నారాయణ గిరి గెస్ట్ హౌస్, మఠాలు, మేదర మిట్ట, వరాహ స్వామి గెస్ట్ హౌస్, రాంబగీచ, లేపాక్షి సిఆర్ఓ, బాలాజీ బస్టాండ్ రూట్లలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడుపుతోంది. ఈ రూట్లో తిరగడానికి దాదాపు అరగంట సమయం పడుతున్నట్లు గుర్తించిన ఆర్టీసీ ట్రయిల్ రన్ ద్వారా సాధ్యసాధ్యాలను పరిశీలిస్తోంది. తిరుమలలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణం చేసేందుకు యాత్రికులకు అవకాశం కల్పించనున్న టీటీడీ ఈ మేరకు ట్రయిల్ రన్ విజయవంతం అయ్యాక పూర్తిస్థాయి నిర్ణయం తీసుకోబోతోంది. తిరుమలలో తిరిగే యాత్రికులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని ఆర్టీసీ ద్వారా టీటీడీ కల్పించ బోతోంది. అయితే ఇందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది.