విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో మరణించింది. తల్లి మృతిని తట్టుకోలేక కుమార్తె తల్లి శవం ముందు కన్నీరు కారుస్తూ ప్రాణాలు కోల్పోయింది. ఆరు గంటల వ్యవధిలో ఇద్దరూ మరణించడం కుటుంబాన్ని, గ్రామస్తులను కలచివేసింది.
తల్లీ కూతుళ్ల మధ్య బంధం ఎంత గొప్పదో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. తల్లి మృతికి తట్టుకోలేక కుమార్తె కూడా తల్లి మృతదేహం ముందు కన్నీరు కారుస్తూ ప్రాణాలు వదిలింది. విజయనగరం జిల్లా భోగాపురంలో చోటుచేసుకున్న విషాద ఘటన అందరినీ కలచివేస్తుంది. బోగాపురం మరాడ వీధికి చెందిన ఆళ్ల వనజాక్షి (74) బుధవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు. వనజాక్షికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె ఎండాడలో నివసించగా, కుమారుడు శ్రీను భోగాపురంలో ఉంటున్నాడు. చిన్న కుమార్తె కొల్లు విజయలక్ష్మి సాలూరులో నివాసం ఉంటుంన్నారు.
అయితే రెండు రోజుల క్రితం విజయలక్ష్మి భోగాపురంలో ఉన్న తన తల్లి దగ్గరకి వచ్చారు. అక్కడ నుండి వనజాక్షి, విజయలక్ష్మి ఇద్దరు కలిసి విశాఖ ఎండాడలో ఉన్న తన పెద్ద కుమార్తె వద్దకు వెళ్లారు. అయితే ఎక్కడకు వెళ్లిన తరువాత రెండు రోజులకి బుధవారం సాయంత్రం వనజాక్షి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించి అక్కడే కన్నుమూశారు. దీంతో తల్లి మృతదేహాన్ని స్వగ్రామమైన భోగాపురానికి తీసుకువచ్చి గురువారం ఉదయం అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. ఇంటి ముందు వనజాక్షి భౌతికకాయం ఉంచగా కుమార్తె విజయలక్ష్మి కన్నీటిలో మునిగిపోయారు.
తల్లి శవం పక్కనే రోదిస్తూ కొద్దిసేపటిలోనే స్పృహ కోల్పోయింది. హుటాహుటిన విజయలక్ష్మిని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. మార్గమధ్యలోనే ప్రాణాలు వదిలారు. ఆరు గంటల వ్యవధిలో తల్లికూతురు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబాన్ని, గ్రామస్తులను విషాదంలో ముంచేసింది. విజయలక్ష్మి మృతదేహాన్ని ఆమె భర్త స్వగ్రామమైన సాలూరుకు తరలించారు. జరిగిన విషాద ఘటన తల్లీకూతుళ్ల బంధాన్ని తెలియజేస్తుంది.