శ్రీ మహా లక్ష్మి కొలువైన క్షేత్రం అష్టాదశ మహా శక్తి పీఠాలలో ఒకటి కొల్హాపూర్. పంచగంగ నదీ తీరాన ఉన్న ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. ఇక్కడ చేసిన చిన్న దానం కూడా మేరు పర్వతమంత మేలుచేస్తుందని ఆర్యోక్తి. ఇక్కడ అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా, శక్తిరూపంగా భక్తులతో పూజలను అందుకుంటుంది. అటువంటి విశేష ప్రాముఖ్యత ఉన్న కొల్హాపూర్ కి వెళ్ళాలనుకునే భక్తులకు తెలంగాణా RTC స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ రోజు ఈ టూర్ కి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
దేశంలో అత్యంత పురాతనమైన లక్ష్మీదేవి ఆలయంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ ఆలయం ప్రసిద్ధి చెందింది. పంచగంగ నదీ తీరాన శ్రీ మహాలక్ష్మి కొలువైన క్షేత్రం కొల్హాపూర్ కాశీ అంతటి ప్రాచీన క్షేత్రంగా పురాణ కథ. ఈ ఆలయాన్ని ఆరువేల ఏళ్ళ నాటిదిగా పరిగణిస్తారు. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇది సతీదేవి నయనం పడిన ప్రదేశం. కార్యసిద్ధిదాయినిగా, సంపత్ప్రదాయినిగా మహాలక్ష్మీ దేవిని పుజిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసం, మార్గశిర మాసాల్లో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత ఫలవంతం అని విశ్వాసం. ఈ నేపధ్యంలో కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవలనుకునే భక్తుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. నాలుగు రోజుల పాటు సాగనున్న ఈ స్పెషల్ టూర్ ని తక్కువ ధరకే భక్తులకు అందిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ఎంజీబీఎస్ నుంచి సూపర్ లగ్జరీ బస్సు కొల్హాపూర్ యాత్రకు బయలు దేరుతుంది. మర్నాడు అంటే 19వ తేదీన గానుగాపూర్ కి చేరుకుంటారు.
రెండో రోజు ఉదయం శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుని.. అనంతరం 19న సాయంత్రానికి కొల్హాపూర్ క్షేత్రానికి చేరుకుంటారు. ఇక్కడ ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారు. శ్రీ మహాలక్ష్మి దర్శన అనంతరం [పాండురంగడు కొలువైన పండరీపూర్‌కు చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.
మూడో రోజు ఉదయం 20వ తేదీన శ్రీ విఠళేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు. అనంతరం సాయంత్రానికి తుల్జాపూర్ కి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ శివాజీకి ఖడ్గాన్ని అందించిన భవాని మాతను దర్శనం చేసుకుంటారు. తుల్జాపూర్ నుంచి తిరిగి హైదరబాద్ కు బయలు దేరతారు. 21వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు ఎంజీబీఎస్ కి చేరుకుంటారు.
ఎవరైనా మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను తక్కువ ధరకే చూడాలని కోరుకునే భక్తులకు ఇప్పుడు TSRTC అందిస్తున్న ఈ స్పెషల్ టూర్ మంచి అవకాశం అని చెప్పవచ్చు. ప్రయాణీకులు ముందస్తు రిజర్వేషన్ ఆన్‌లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. లేదా సమీపంలోని బుకింగ్ ఏజెంట్ దగ్గర కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఒక్కోక్కరికి టికెట్ ధర రూ. 3 వేలు.