తిరుమల శ్రీవారి ఆలయం పేరుతో ఆన్‌లైన్‌లో ఓ గేమింగ్ యాప్ కలకలం సృష్టిస్తోంది. టీటీడీ ఒరిజినల్ టెంపుల్ అంటూ ఓ యాప్‌ను డెవలప్ చేసిన తమిళనాడుకు చెందిన రోబ్లెక్స్ అనే ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యాప్‌లో తిరుమల ఆలయ ప్రవేశం, దర్శనంతో పాటు హుండీలో కానుకలు సమర్పించడం, లడ్డు ప్రసాదం ఎలా పొందాలో చెబుతూ ఈ గేమ్‌ను డిజైన్ చేసి.. శ్రీవారి పేరుతో భక్తుల నుంచి వర్చువల్ కరెన్సీని దండుకుంటున్నారు. దీన్ని ఆలయ పవిత్రత, భద్రతకు సంబంధించిన అంశంగా భావిస్తున్న భక్తులు యాప్ నిర్వాహకులపై మండిపడుతున్నారు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీకి సంబంధించిన వివరాలతో యాప్ డెవలప్ చేయడాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నారు టీటీడీ అధికారులు యాప్ నిర్వాహకులపై ఆరా తీస్తున్నారు.
శ్రీవారి భక్తుల సెంటిమెంట్‌తో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన జనసేన నేత కిరణ్ రాయల్ ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. తిరుమల శ్రీవారి ఆలయంపై గేమింగ్ యాప్ డిజైన్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పందించిన చైర్మన్ బిఆర్ నాయుడు గేమింగ్ యాప్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశించారు.
టీడీడీ ఛైర్మన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు గేమింగ్ వ్యవహారంపై దృష్టి సారించారు. గేమింగ్ సంస్థ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయం, దర్శనం చేసుకునే వరకు దృశ్యాలతో గేమింగ్ యాప్‌ను రూపొందించినట్టు గుర్తించారు. భక్తుల సెంటిమెంట్ ను అదును చేసుకుని డాలర్స్ రూపంలో అన్ లైన్‌లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించిన అధికారులు సదురు సంస్థపై చర్యలు తీసుకున్నారు. స్వలాభం కోసం తిరుమల దృశ్యాలతో ఇలా అక్రమాలను పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు అన్నారు.