తిరుమల శ్రీనివాసుడంటే ప్రపంచమంతా ఫేమస్సే.. అందుకే ఆయన దర్శనం కోసం ప్రపంచం నలుమూలలనుంచి రెక్కలు కట్టుకొని వాలిపోతుంటారు. ఒక్క శ్రీవారు మాత్రమే కాదు ఆయనకు ఎంతో ఇష్టమైన లడ్డూ అన్నా భక్తులకు ఎంతో ప్రీతి. అందుకే లడ్డూల కోసం క్యూలైన్లలో పోటీపడుతుంటారు భక్తులు. స్వామివారిని దర్శించుకుని వచ్చే భక్తులకు స్వామివారి ప్రసాదంగా చిన్న లడ్డూ అందిస్తారు. ఆ తర్వాత భక్తులు తమకు కావలసినన్ని లడ్డూలు కౌంటర్లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఇక స్వామి దర్శనానికి వచ్చి, క్యూ లో నిలబడి నిలబడి అలసిపోయిన తన భక్తులకు కడుపారా భోజనం పెట్టి పంపిస్తారు స్వామివారు. ఆ అన్న ప్రసాదంలో ఇప్పుడు భక్తుల కోసం మసాలా వడను కూడా చేర్చారు.
అవును, టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానం మేరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం మెనూలో మసాలా వడను చేర్చారు. సోమవారం నుంచి భక్తులకు దీనిని వడ్డించడం ప్రారంభించారు. తొలిరోజు ఐదువేల వడలను ప్రయోగాత్మకంగా వడ్డించారు. మరో వారం పాటు పరిశీలించిన తరువాత పూర్తిస్థాయిలో అమలు చేస్తారని సమాచారం. పలువురు భక్తులు అన్నప్రసాదాల నాణ్యత, వడ అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు మొత్తం 6.83 లక్షల మందికి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించింది. ఇక స్వామివారి హుండీ ఆదాయం రూ.34.43 కోట్లు సమకూరగా 1,13,132 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
Amaravati News Navyandhra First Digital News Portal