ఆపరేషన్ సింధూర్ తర్వాత మన సైనిక శక్తిని మరింత బలోపేతం చేసే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా శత్రు దేశాల కదలికపై నిఘా పెట్టేందుకు MALE డ్రోన్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా వీటిని రూపొందించనుంది. వీటితో చైనా, పాకిస్థాన్ వంటి శత్రు దేశాల కదలికలను అత్యంత కచ్చితత్వంతో గమనించడం సాధ్యపడుతుంది.
దేశ సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఓవైపు సొంత శాటిలైట్ల ద్వారా అంతరిక్ష నుంచి నిఘా నేత్రాన్ని విస్తరించిన భారత్.. ఇప్పుడు విమానాలు ఎగిరే ఎత్తు నుంచి సైతం శత్రువుల ప్రతి కదలికను పసిగట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ (MALE) డ్రోన్‌ల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ పథకం కింద దేశీయ ప్రైవేట్ కంపెనీల నుండి 87 డ్రోన్‌లను కొనుగోలు చేయనుంది. రక్షణ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పథకంపై కేంద్రం సుమారు రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనుంది. మేకిన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగంగా దీనిని చేపట్టింది. దీంతో స్వదేశీ డ్రోన్ టెక్నాలజీని ప్రోత్సహించడమే కాకుండా, విదేశీ కంపెనీలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది.
మొదటిసారిగా భారతీయ కంపెనీలకు ఇటువంటి అధునాతన MALE డ్రోన్‌లను తయారు చేసే అవకాశం లభించింది. గతంలో ఈ డ్రోన్లను ఇజ్రాయెల్ కంపెనీ నుంచి కేంద్రం కొనుగోలు చేసింది. డ్రోన్‌ల కొనుగోలుకు ముందు అవసరమైన పరీక్షలు కూడా నిర్వహిస్తారు. తద్వారా డ్రోన్‌ల డిజైన్, టెక్నాలజీ సైన్యం అవసరాలకు అనుగుణంగా ఉందా లేదా అన్నది పరిశీలించి, అవసరమైన మార్పులను సైతం సూచించేందుకు ఆస్కారం ఉంటుంది. ఈ డ్రోన్‌లను అధునాతన నిఘా సామర్థ్యంతో పాటు యుద్ధానికి సైతం ఉపయోగపడేలా తయారుచేస్తున్నారు. రియల్-టైమ్ ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచర్య సమాచారాన్ని అందిస్తాయి. వీటి అతి పెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి కనీసం 35వేల అడుగుల ఎత్తులో 30 గంటలకు పైగా నిరంతరం ఎగరగలవు. ఈ డ్రోన్‌లలో 60శాతం కంటే ఎక్కువ భాగాలు స్వదేశీ ఉత్పత్తులే ఉండాలన్న నిబంధన అమలుకానుంది.
MALE డ్రోన్‌ల చేరికతో త్రివిధ దళాల నిఘా సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. ముఖ్యంగా భారత వైమానిక దళానికి తూర్పు, పశ్చిమ సరిహద్దులపై నిఘా ఉంచడంలో గణనీయమైన సహాయం అందుతుంది. ఈ ప్రతిపాదనను రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి కమిటీ ముందుకు తీసుకురానుంది. కమిటీ ఆమోదం లభించిన వెంటనే డ్రోన్‌ల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుంది. తద్వారా దేశ సరిహద్దుల్లో శత్రువు ప్రతి కదలికను అత్యంత కచ్చితత్వంతో నిశితంగా గమనించడం సాధ్యపడుతుంది.