భాగ్యనగరానికి అమిత్ షా.. తెలంగాణ బీజేపీలో తేల్చాల్సిన లెక్కలు ఏమైనా ఉన్నాయా?

కేంద్ర హోం మంత్రి అమిత్ షా భాగ్యనగరం గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు. అమిత్ షా స్వామి కార్యంతో పాటు పార్టీ కార్యం కూడా పూర్తి చేసే ప్లాన్ తో వస్తున్నట్ల తెలుస్తోంది. ఇంతకీ షా సడెన్ సౌత్ ట్రిప్ కు కారణమేంటి..? తెలంగాణ బీజేపీలో తేల్చాల్సిన లెక్కలు ఏమైనా ఉన్నాయా?

సెప్టెంబర్ 6వ తేదీన గణేష్ నిమజ్జన శోభాయాత్రకు ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాబోతున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10కి బేగంపేట్ ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడ నుంచి పక్కనే ఉన్న ఐటీసీ కాకతీయ హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 3 వరకు బీజేపీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తారు.

మధ్యాహ్నం 3 గంటల తర్వాత హోటల్ లోనే ఏర్పాటు చేసిన 48 ఏళ్ల భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ప్రస్థానం ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు. సాయంత్రం 4.10 నుంచి 5 వరకు ఎంజే మార్కెట్ వద్ద నిమజ్జన శోభాయాత్రలో పాల్గొంటారు. గంగమ్మ ఒడికి తరలివస్తున్న గణనాథులకు స్వాగతం పలికి ప్రసంగిస్తారు. తిరిగి 5 గంటల తర్వాత బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

భాగ్యనగర గణేశ్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు అమిత్ షా హైదరాబాద్ వస్తున్నా.. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపిక తర్వాత తొలిసారి రాష్ట్రానికి రానుండటంతో కొన్ని సరిచేయాల్సిన కొత్త లెక్కలు ఉన్నాయని షా భావిస్తున్నారట. అందుకే బీజేపీ నేతలకు ఈ పర్యటనలో గంటసేపు టైమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాషాయదళంలోని అంతర్గత కలహాలు పార్లమెంట్ సమావేశాల సమయంలోనే అధిష్ఠానం దృష్టికి చేరడంతో వాటికి ట్రీట్‌మెంట్ ఇస్తారని నేతలు అనుకుంటున్నారు.

రాష్ట్రంలో ఇటీవల పరిణామాలు, కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగింత వ్యవహారం, వరదల నష్టాలు, కాంగ్రెస్ వైఫల్యాలపై చర్చించే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు కోసం ఇప్పటికే ఒకసారి ఢిల్లీ వెళ్లి వచ్చి రాంచందర్ రావుకు ఈ టూర్ లో జాబితాపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య సమన్వయ లోపం, ఇంటర్నల్ వార్ పై వార్నింగ్ ఇచ్చే అవకాశం లేకపోలేదన్న చర్చ జోరుగా సాగుతోంది.

తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సహా స్థానిక సంస్థల ఎన్నికలకు యంత్రాంగం సిద్ధమవుతున్న వేళ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంపై రాష్ట్ర నాయకులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. టీబీజేపీ నయా చీఫ్ రాంచందర్ రావు నేతల నుంచి అందుతున్న సహకారం, పార్టీ పరిస్థితి, అందిపుచ్చుకోవాల్సిన అవకాశాలపై అమిత్ షా పక్కా ప్రణాళికలతో నేతలకు మాస్టర్ ప్లాన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ సిగ్నల్ ఇస్తే నిమజ్జనం తర్వాత కొత్త టీమ్ ను రాంచందర్ రావు ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *