250 ఏళ్ల నాటి పురాతన ఆలయం.. ఒక్క దేవుడి విగ్రహం కూడా లేదు.. ఎక్కడో తెల్సా

ఏ గుడికెళ్లినా.. దేవుడుంటాడు. అక్కడ పూజలు జరుగుతుంటాయి. భక్తులు వస్తుంటారు. భక్తుడికీ, భగవంతుడికీ అనుసంధానమైన పూజారి ఉంటారు. కానీ, అక్కడ మాత్రం పరిస్థితి భిన్నం. భక్తులు రారు. పూజారి లేడు. అసలు పూజారి, భక్తులు అనుసంధానం చేసే దేవుడే లేడు. 250 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ గుళ్లో దేవత విగ్రహ ప్రతిష్ఠాపన ఇంకా జరక్కపోవడానికి గల కారణమేంటి.. ఆ మిస్టరీ ఏంటీ..?

ఆధ్యాత్మిక ప్రదేశాలు.. పర్యాటక ప్రాంతాలుగా కూడా విరాజిల్లుతుంటాయి. కానీ, ఓ ఆధ్యాత్మిక ప్రదేశం ఇప్పుడు కేవలం ఓ పర్యాటక ప్రాంతంగా.. వెడ్డింగ్ ఫోటో షూట్ వేదికగా మిగిలిపోయింది. చుట్టూ కొండలు.. పచ్చని ప్రకృతి.. 250 ఏళ్లకు పైగా చరిత్ర.. అద్భుత శిల్పం.. వెరసి ఆ గుడి పంచభూతాలకు సాక్షీభూతంగా నిల్చిన ఓ రమణీయ దృశ్యకావ్యం. కానీ, ఆ గుడి వెనుక ఓ పెద్ద మిస్టరీ ఉంది. ఆ మిస్టరీ ఏంటో ఆ కుటుంబ వారసులకూ ఇప్పటికీ సరిగ్గా తెలియకుండా పోయింది. స్థానికులకు అంతకన్నా తెలియదు. అసలేం రహస్యముందనేది.. ఇప్పటికీ పెద్దపెల్లి జిల్లాలో కొలువైన.. ఇదిగో ఈ ఆలయంలో ఇక్కడి ప్రతిష్ఠించాల్సిన ఆండాళమ్మను ప్రతిష్ఠించకపోవడం వెనుక కారణమేంటో ఎవ్వరికీ తెలియదు.

ఆండాళమ్మ ఆలయంలో ప్రస్తుతం ఓ హనుమాన్ విగ్రహాన్ని ఎవరో తీసుకొచ్చి పెట్టి.. ఓ విగ్రహముండాలన్నట్టుగా చిన్నగా నిలబెట్టారు. కానీ, ఈ పురాతమైన అద్భుత శిల్పంలో మనకు గోపురంతో పాటు.. ఆలయ ఎంట్రన్స్ లో కనిపించే కమాన్ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో ఆండాళమ్మ కోసం 250 ఏళ్ల క్రితమే నిర్మించిన ఈ ఆలయంలో ఆ దేవతను ఎందుకు ప్రతిష్ఠంచలేదు..? ఆండాళమ్మ ఆలయానికి ఒక ఐదు వందల మీటర్ల దూరంలో ఇదే ధర్మాబాద్ లో ఇదిగో 450 ఏళ్ల క్రితం కట్టిన మరో ఆలయాన్ని మనం ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. రంగనాయకస్వామి ఈ ఆలయం కూడా పురాతన శిల్పానికి ఓ ప్రతీకలా ఈ పచ్చని ప్రకృతిలో అలరిస్తోంది. ఏవో ధూప, దీప నైవేద్యాలు మినహా.. ఈ ఆలయానికి ఆదరణ కరువైందనే చెప్పాలి. ఎక్కడ చూసినా చిత్తడితో.. పెద్దపెల్లి జిల్లా కేంద్రానికి కేవలం ఓ నాల్గు కిలోమీటర్ల దూరంలో కనిపించే ఈ ఆలయాలను ఇక్కడి పాలకులుగానీ, ఎండోమెంట్ అధికారులుగానీ.. ఇతరులుగానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పైగా రంగనాయక స్వామి ఆలయాన్ని పురావస్తుశాఖకు అప్పగించాక.. దీని బాగోగులు చూసేవారే కరువయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ రంగనాయకస్వామి ఆలయాన్ని ఎరబాటి వంశస్తులు నిర్మించారు. ఈ ఆలయానికి సంబంధించిన సుమారు 450 ఎకరాల భూములను కూడా ఇక్కడి పెద్దలు కబ్జా చేసినట్టుగా కూడా ఇప్పటికే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఎరబాటి వంశస్తులే ఈ రంగనాయకుడికి దగ్గరలో.. ఇదిగో మిస్టరీగా మిగిలిపోయిన ఈ ఆండాళమ్మ ఆలయాన్ని నిర్మించారు.

ఎరబాటి వంశస్తులకు రంగనాయకుడి ఆలయం నిర్మించిన తర్వాత.. స్వయానా స్వామే కలలోకొచ్చి ఆండాళమ్మ ఆలయాన్ని నిర్మించాలని చెప్పినట్టూ ఓ ప్రచారముంది. దాని ప్రకారమే ఈ గుడిని కట్టినప్పటికీ… ఆలయ నిర్మాణమనంతరం ఎరబాటి వంశస్తుడైన లక్ష్మీకాంతరావు తీవ్ర అనారోగ్యానికి గురై చనిపోయారు. ఆ తర్వాత ఈ ఆలయంలో ఆండాళమ్మను ప్రతిష్ఠించేందుకు ఎరబాటి వంశస్తులుగానీ.. ఇంకెవ్వరూగానీ ప్రయత్నం చేయలేదు. అద్బుతమైన ఆలయాన్ని నిర్మించి.. ఆండాళమ్మను ఎందుకు ఇంకా ప్రతిష్ఠించలేదన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు ఈ ఆండాళమ్మ ఆలయం ప్రీవెడ్డింగ్ షూట్స్ కు కేరాఫ్ గా మారింది. మొత్తంగా ఓ దృశ్యకావ్యంలా కనిపించే ఓ దేవతలేని ఆలయంలో.. ఆ దేవతనెందుకు ప్రతిష్ఠించలేదనే ఈ రహస్యం ఇప్పట్లో వీడేలా లేకపోగా.. భవిష్యత్ తరాలకూ ఓ మిస్టరీగానే మిగిలిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి.

About Kadam

Check Also

తెలుగు రాష్ట్రాల్లో మోగిన ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. ఫలితాలు ఎప్పుడంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *